Myanmar: సైబర్ నేరాలకు కఠిన చట్టం.. దోషులకు మరణశిక్షకు మయన్మార్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలపై కఠిన చర్యలకు మార్గం సుగమం చేస్తూ రూపొందించిన కొత్త ఆన్‌లైన్ మోసాల నిరోధక బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం సైబర్ నేరాలకు పాల్పడిన కేసుల్లో దోషులుగా తేలిన వారికి నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదుతో పాటు మరణశిక్ష కూడా విధించే అవకాశం కల్పించారు.
వివరాలు
బాధితులను నిర్బంధించినా కఠిన చర్యలే
ఆన్‌లైన్ మోసాల కేంద్రాల్లో పని చేయాలని వ్యక్తులను బలవంతం చేయడం, నిర్బంధించడం లేదా శారీరక, మానసిక హింసకు గురిచేయడం వంటి చర్యలను కూడా ఈ చట్టం తీవ్ర నేరాలుగా పరిగణించనున్నారు.
అలాంటి ఘటనల్లో పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మయన్మార్ పార్లమెంట్ స్పీకర్ ఆంగ్ లిన్ డ్వే తెలిపారు.
ఆయన వివరాల ప్రకారం, సైబర్ నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే అవకాశం ఉండగా, వారి కార్యకలాపాల వల్ల ఇతరుల మరణానికి కారణమైతే మరణశిక్ష అమలు చేసేలా చట్టంలో నిబంధనలు చేర్చారు.
వివరాలు
ఉద్యోగాల పేరుతో విదేశీయులను మోసం
ఉద్యోగ అవకాశాల పేరుతో విదేశీ విద్యార్థులు, యువతను మయన్మార్‌కు రప్పిస్తున్న సైబర్ ముఠాలపై అనేక ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
అక్కడికి చేరుకున్న తర్వాత బాధితులను బెదిరించి, వారి ఇష్టానికి విరుద్ధంగా సైబర్ నేరాల్లో పాల్గొనేలా ఒత్తిడి చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.
ఈ తరహా నేరాలను పూర్తిగా అరికట్టడమే కొత్త చట్టం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
వివరాలు
మయన్మార్‌లో చిక్కుకున్న తెలుగువారు..
ఇటీవల సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాలు వస్తాయని ఆశించి వెళ్లిన తెలుగు రాష్ట్రాల యువత సైబర్ ముఠాల వలలో చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
సింగపూర్‌కు తీసుకెళ్తామని నమ్మించి దాదాపు 100 మంది తెలుగు విద్యార్థులను మయన్మార్‌కు తరలించిన నేరగాళ్లు, అక్కడికి చేరుకున్న వెంటనే వారి పాస్‌పోర్టులు, ఇతర ప్రయాణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని నిర్బంధించి, సైబర్ నేరాలకు పాల్పడాలని బలవంతం చేసినట్లు బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
దీంతో కుటుంబ సభ్యులు జులై 17న కేంద్ర విదేశాంగ శాఖకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.