Thailand: థాయిలాండ్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్ సంగీత ఉత్సవం ముగిసిన తర్వాత ఓ భారతీయ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుకెట్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమానికి వేలాది మంది పర్యాటకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో జైసాక్షమ్ (28) అనే భారతీయుడు కూడా పాల్గొన్నాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన అతడు అసహజంగా ప్రవర్తించడాన్ని అక్కడి వారు గమనించారు. అదుపు తప్పిన స్థితిలో రోడ్డుపై ఉన్న వస్తువులను, పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన వాహనాలను ధ్వంసం చేసినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.
వివరాలు
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరిన కొద్దిసేపటికే అతడు స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జైసాక్షమ్ మృతికి గల ఖచ్చితమైన కారణాలను వైద్యులు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు.బాధితుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, శారీరక దాడికి సంబంధించిన సూచనలు కూడా కనిపించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా,ఈ విషయాన్ని బాధితుడి కుటుంబానికి తెలియజేయడానికి భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తైన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.