Page Loader
Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ 
Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్

Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ 

వ్రాసిన వారు Stalin
Dec 18, 2023
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌ను జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్ల ఆయుపట్టుగా భావించే సొరంగాలపై ఇజ్రాయెల్ సైన్యం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హమాస్‌కు సంబంధించిన అనేక సొరంగాలను ఇజ్రాయెల్ గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా హమాస్ మిలిటెంట్లకు సంబంధించిన అతిపెద్ద సొరంగాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. ఈ సొరంగం పరిమాణం చాలా పెద్దదని, చిన్న వాహనాలు సొరంగం లోపలికి సులభంగా వెళ్లగలవని సైన్యం వెల్లడించింది. దాదాపు 4కి.మీ వరకు విస్తరించి ఉన్న ఈ భారీ సొరంగం హమాస్ నెట్‌వర్క్‌కు చాలా కీలకం. ఈ సొరంగం గాజా సరిహద్దుకు కేవలంలో 400 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.

హమాస్

సొరంగంలో భారీగా ఆయుధాలు 

ఈ భారీ సొరంగం నిర్మాణానికి మిలియన్ డాలర్లు వెచ్చించారని, ఇక్కడ చాలా ఏళ్లుగా హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబర్ 7దాడులకు సూత్రధారిగా భావిస్తున్న హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ సోదరుడు మహ్మద్ యాహ్యా ఆధ్వర్యంలో ఈ సొరంగాన్ని నిర్మించినట్లు సైన్యం భావిస్తోంది. ఈ సొరంగం మార్గంలోనే డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, వెంటిలేషన్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అలాగే రైలు వంటి సౌకర్యాలు కూడా ఉన్నట్లు ఆర్మీ చెబుతోంది. సొరంగం నేల మట్టితో, గోడలు కాంక్రీటుతో నిర్మించారు. దీని ప్రవేశ ద్వారం 1.5సెంటీమీటర్ల మందపాటి గోడలతో సిలిండర్ సైజులో ఉంటుందని ఆర్మీ వెల్లడించింది. సొరంగంలో హమాస్ భారీగా ఆయుధాలను నిల్వ ఉంచిందని, ఇజ్రాయెల్‌ను నాశనం చేసేందుకు వాటిని ఇక్కడ ఉంచినట్లు పేర్కొంది.