Iran War: ఇరాన్ యుద్ధంలో 50 శాతం క్షీణించిన అమెరికా పేట్రియాట్,థాడ్ క్షిపణుల నిల్వలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆయతుల్లా ఖమేనీ ను అంతం చేస్తే అక్కడి పాలన కూలిపోతుందనే అమెరికా అంచనాలు తారుమారవడంతో ఇరాన్‌తో సుదీర్ఘంగా యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కీలక క్షిపణుల నిల్వలు తగ్గిపోవడం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం పేట్రియాట్, థాడ్ వంటి అడ్డుకునే క్షిపణుల నిల్వలు సగానికి తగ్గాయి. తోమహాక్ క్షిపణుల నిల్వలు సుమారు 35 శాతం మేర తగ్గినట్లు వెల్లడించాయి. అలాగే లక్ష్యసాధన క్షిపణుల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వినియోగించబడింది. ఈ స్థాయిలో వినియోగం జరగడం అమెరికా సైనిక సన్నద్ధతలో లోపాలను బయటపెడుతోందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ఇరాన్ కంటే ట్రంప్‌కే ఒప్పందం అత్యవసరం
స్వల్పవ్యవధిలో సైనిక చర్యలకు ఈ నిల్వలు సరిపోతాయని భావించినప్పటికీ, మరో ప్రాంతంలో భారీ స్థాయి ఘర్షణ తలెత్తితే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఆయుధ నిల్వలపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు. ఇక మరోవైపు, ఇరాన్‌కు ఇంకా కీలకమైన సైనిక సామర్థ్యాలు ఉన్నాయని పెంటగాన్ నిఘా విభాగం అంచనా వేసింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ల తర్వాత కూడా ఆ దేశం ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని పేర్కొంది. అయితే ఇరాన్ సైనిక శక్తిని తీవ్రంగా దెబ్బతీశామని ట్రంప్ యంత్రాంగం చెబుతున్న ప్రకటనలకు ఈ అంచనాలు భిన్నంగా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కంటే ట్రంప్‌కే ఒప్పందం అత్యవసరంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.