Nepal Floods: నేపాల్ వరదల్లో కొట్టుకుపోతున్న మృతదేహం నుంచి బంగారం చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో వరదల బీభత్సం కొనసాగుతున్న వేళ కొన్ని అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు వ్యక్తులు మృతుల వద్ద ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలను దొంగిలిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వివరాలు
నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని ఒడ్డుకు..
నరయాణి నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళ మృతదేహాన్ని కొందరు యువకులు కర్రల సాయంతో ఒడ్డుకు లాగారు.
అనంతరం ఆమె చెవులకు ఉన్న చెవిపోగులను తీసుకున్నట్లు వీడియోలో కనిపించింది.
ఈ ఘటన జరుగుతుండగా చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో ప్రజలు నిలబడి దృశ్యాలను వీడియోగా చిత్రీకరించారు.
41 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈ వైరల్ వీడియోను నేపాల్ పోలీసులు ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం, ఇతర అమానవీయ చర్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.
వివరాలు
469కి చేరిన మృతుల సంఖ్య
మరోవైపు నేపాల్‌లో వరదలు, మెరుపు వరదల కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఇప్పటివరకు ఈ విపత్తులో 469 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. మరో 1,500 మంది ఆచూకీ ఇంకా లభించలేదని తెలిపారు.
భారత్‌కు చెందిన 290 మంది కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. మరోవైపు సహాయక, రక్షణ చర్యలను అధికారులు మరింత వేగవంతం చేశారు.
ఇప్పటివరకు 50 మంది విదేశీయులు సహా మొత్తం 796 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు.
వివరాలు
వరదల కవరేజీపై చైనా ఆంక్షలు?
ఇదిలా ఉండగా.. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన మెరుపు వరదలపై మీడియా కవరేజీకి చైనా కఠినమైన ఆంక్షలు విధించినట్లు సమాచారం.
బీజింగ్‌కు ప్రతికూలంగా ఉన్నట్లు భావించిన కొన్ని వీడియోలు, వరద బాధితుల పరిస్థితికి సంబంధించిన పలు కథనాలను చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వరదలపై కేవలం సహాయక, రక్షణ చర్యలకు సంబంధించిన సమాచారమే బయటకు వెళ్లేలా చైనా అధికారులు నియంత్రణలు విధించినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మృతదేహం నుంచి ఆభరణాలు దొంగిలించిన ఇద్దరు అరెస్ట్
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026