Nepal: 'మా ఇల్లు కూల్చేశారు.. ఇప్పుడు ఎక్కడ ఉండాలి?' నేపాల్ ప్రధానికి 11 ఏళ్ల చిన్నారి లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ చర్యలతో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల్లో 11 ఏళ్ల రాధిక మహతో అనే బాలిక.. ప్రధాని బాలేంద్ర షాకు రాసిన లేఖ దేశవ్యాప్తంగా భావోద్వేగ స్పందన కలిగిస్తోంది. ''మా కుటుంబం మీ పార్టీకి ఓటు వేసింది. కానీ మీరు మా ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు మేమెక్కడ ఉండాలి.. నేను ఎక్కడ చదవాలి?'' అంటూ ఆ చిన్నారి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
వివరాలు
రాధికకు అనేకమంది మద్దతు
ప్రభుత్వ చర్యల కారణంగా సుమారు 15 వేల మందికి పైగా పేద ప్రజలు నివాసాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు నాలుగు వేల తాత్కాలిక గృహాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అనంతరం బాధిత కుటుంబాలను కాఠ్‌మాండూకు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనేపా పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలకు తరలించారు. కొత్త ప్రాంతానికి వెళ్లిన తర్వాత రాధిక చదువు కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆమె మూడో తరగతి చదువుతోంది. విద్యకు దూరమైన పరిస్థితుల్లో తన బాధను నేరుగా ప్రధానికి లేఖ రూపంలో తెలియజేసింది. ఈ లేఖను ఒక ఆన్‌లైన్ వార్తా వేదిక ప్రచురించడంతో అది వేగంగా వ్యాపించి, రాధికకు అనేకమంది మద్దతుగా నిలుస్తున్నారు.
వివరాలు
సరైన పునరావాస ప్రణాళిక లేకుండా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టొద్దు: నేపాల్ సుప్రీం
ఇదిలా ఉండగా, నదీ తీర ప్రాంతాలు భారీగా ఆక్రమణలకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. వరద ముప్పును తగ్గించడంతో పాటు పట్టణ అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారం చివరకు నేపాల్ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. సరైన పునరావాస ప్రణాళిక సిద్ధం చేయకుండా ప్రజలను బలవంతంగా తరలించడం లేదా ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగించవద్దని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.