
KP Sharma Oli: శ్రీరాముడి జన్మస్థానంపై మరోసారి నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మళ్లీ శ్రీరాముడి జన్మస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని అయోధ్యలో కాకుండా శ్రీరాముడు నేపాల్ దేశంలో జన్మించారని మరోసారి పునరుద్ఘాటించారు. ఖాట్మండులో జరిగిన తమ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తన స్వంత అభిప్రాయం కాదని, వాల్మీకి రచించిన అసలైన రామాయణంలోని వివరాల ఆధారంగా చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. రాముడి అసలైన జన్మస్థలం నేపాల్‌లోనే ఉందని,ఈ వాస్తవాన్ని ప్రజలు నిర్భయంగా ప్రచారం చేయాలని ఓలీ పిలుపునిచ్చారు.
వివరాలు
ఇతిహాసాల్లో పేర్కొన్న అనేక ప్రాచీన ప్రదేశాలు ఇప్పటి నేపాల్‌లో..
ఇలాంటి వ్యాఖ్యలు ఆయన 2020లో కూడా చేసిన విషయం గమనించదగ్గది. అప్పట్లోనూ నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలోని థోరి ప్రాంతమే నిజమైన అయోధ్య అని, శ్రీరాముడు అక్కడే జన్మించారని పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో రాముడితో పాటు శివుడు, విశ్వామిత్రుడు వంటి గొప్ప పురాణపురుషులు కూడా నేపాల్ దేశంలోనే జన్మించారని చెప్పారు. ఇతిహాసాల్లో పేర్కొన్న అనేక ప్రాచీన ప్రదేశాలు ఇప్పటి నేపాల్‌లోని సున్సారి జిల్లాలో ఉన్నాయని ఓలీ వివరించారు.