LOADING...
Nepal: జెన్‌జెడ్ ఉద్యమాల తర్వాత నేపాల్‌లో తొలి ఎన్నికలు
జెన్‌జెడ్ ఉద్యమాల తర్వాత నేపాల్‌లో తొలి ఎన్నికలు

Nepal: జెన్‌జెడ్ ఉద్యమాల తర్వాత నేపాల్‌లో తొలి ఎన్నికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జెన్‌ జెడ్‌ యువత చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో గత సంవత్సరం కేపీ శర్మ ఓలి నాయకత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన తరువాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవి. నేపాల్‌ పార్లమెంట్‌ ప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలు ఉండగా, అర్హులైన సుమారు 1.89 కోట్ల మంది ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 3,406 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో 165 స్థానాలకు ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా ఎన్నికలు జరగగా, మిగతా 110 స్థానాలకు నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో సభ్యులను ఎంపిక చేస్తారు. ఈ నెల 2వ తేదీ సోమవారం అర్ధరాత్రితో ఎన్నికల ప్రచారం అధికారికంగా ముగిసింది.

వివరాలు 

రాజకీయ పార్టీలు సహకరించాలి: రాంప్రసాద్‌ భండారి

గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తాత్కాలిక ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాంప్రసాద్‌ భండారి మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఓటింగ్‌ శాతం గతంతో పోలిస్తే పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలపై అవగాహన పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల వల్ల చెల్లని ఓట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అదే సమయంలో ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆపద్ధర్మ ప్రభుత్వ హోంమంత్రి ఓం ప్రకాశ్‌ ఆర్యల్‌ విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

3.41 లక్షల భద్రతా సిబ్బంది

ఎన్నికల సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది. దేశమంతటా మొత్తం 10,967 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ప్రత్యక్ష ఓటింగ్‌లో మొత్తం 65రాజకీయ పార్టీలు పోటీ చేస్తుండగా,నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో 63 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల భద్రత కోసం విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 80వేల మంది ఆర్మీ సిబ్బంది,76వేల మంది పోలీసులు, 34 వేల మంది సాయుధ పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు తాత్కాలిక ఎన్నికల పోలీసులు సుమారు 1.50 లక్షల మందిని నియమించారు. మొత్తం మీద ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 3.41 లక్షల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

Advertisement

వివరాలు 

జెన్‌ జెడ్‌కు అనుకూలం - వ్యతిరేకం

ఆశ్రిత పక్షపాతం,అవినీతికి వ్యతిరేకంగా రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని డిమాండ్ చేస్తూ గత సంవత్సరం సెప్టెంబర్‌ 8,9 తేదీల్లో యువత ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసనలతో కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆ సమయంలో కేపీ శర్మ ఓలి నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) సీపీఎన్-యూఎంఎల్,నేపాలీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో రెండు మూడవ వంతు మెజారిటీ ఉండేది. ఓలి పదవి నుంచి తప్పుకోవడంతో అధ్యక్షుడు పౌడెల్ పార్లమెంట్‌ను రద్దు చేసి సుశీలా కర్కిని ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు.

Advertisement

వివరాలు 

జెన్‌ జెడ్‌కు అనుకూలం - వ్యతిరేకం

యువత కోరిన మార్పులను అమలు చేయడానికి తాము పలు చర్యలు తీసుకున్నామని పుష్ప కుమార్ దహల్ 'ప్రచండ' నాయకత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే పార్టీ నాయకత్వంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మాత్రం ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ఇదే సమయంలో రవి లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ), అలాగే సీనియర్ నాయకులు బాలేంద్ర షా, గగన్ థాపా నేతృత్వంలోని సంస్కరణలు కోరే నేపాలీ కాంగ్రెస్ వర్గాలు జెన్ జెడ్ యువత ఆశయాలకు మద్దతు ఇస్తున్నాయి.

వివరాలు 

జెన్‌ జెడ్‌కు అనుకూలం - వ్యతిరేకం

కుల్మాన్ ఘీసింగ్ నేతృత్వంలోని ఉజ్యాలో నేపాల్ పార్టీ, అలాగే మాజీ ధరణ్ మేయర్ హర్క సంపంగ్ నేతృత్వంలోని శ్రమ శక్తి పార్టీ ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్ రాజకీయాలు రెండు వర్గాలుగా విభజించబడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు సంప్రదాయ విధానాలను కొనసాగించాలనుకునే పార్టీలు ఉండగా, మరోవైపు యువత ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు కోరే పార్టీలు ఉన్నాయి. అయితే ప్రజల్లో సంప్రదాయ పార్టీలపై అసంతృప్తి పెరిగిందని, మార్పును కోరుకునే భావన బలంగా ఉందని వారు పేర్కొంటున్నారు.

వివరాలు 

ఓలి - బాలేంద్ర షా మధ్య నేరుగా పోటీ

రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా (35)ను ప్రకటించింది. మరోవైపు నేపాలీ కాంగ్రెస్ పార్టీ గగన్ థాపాకు మద్దతు తెలిపింది. అయితే సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మాత్రం 75 ఏళ్ల కేపీ శర్మ ఓలినే మరోసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కాఠ్మాండులోని ఝాపా-5 నియోజకవర్గంలో బాలేంద్ర షా,కేపీ శర్మ ఓలి నేరుగా తలపడుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఓలి గతంలో ఆరు సార్లు గెలుచుకున్నారు.

వివరాలు 

ఓలి - బాలేంద్ర షా మధ్య నేరుగా పోటీ

ఈసారి పోటీ తీవ్రంగా ఉండటంతో ఓలి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయకుండా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇదే సమయంలో కాఠ్మాండు చెందిన నేపాలీ కాంగ్రెస్ నాయకుడు గగన్ థాపా మాథేస్ ప్రావిన్స్‌లోని థనుషా-4 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గగన్ థాపా,బాలేంద్ర షా దేశంలోని ఇతర ప్రాంతాల్లో,ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరి ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెబుతున్నారు.

వివరాలు 

ఫలితాలకు కనీసం 24 గంటలు

దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఒకేచోటికి తరలించేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఆ తరువాత 24 గంటల లోపే 165 ప్రత్యక్ష స్థానాల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా 110 స్థానాలకు నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో ఓట్ల లెక్కింపు జరపడానికి మరో రెండు నుంచి మూడు రోజులు పట్టవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాంప్రసాద్ భండారి తెలిపారు.

Advertisement