Netanyahu: లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు.. హిజ్బుల్లాపై చర్యలు కొనసాగుతాయి: నెతన్యాహు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదని, హిజ్బుల్లాపై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించడంతో, ఇరాన్'పై దాడులు తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం తమ ఆపరేషన్లు కొనసాగిస్తుందని నెతన్యాహు కార్యాలయం బుధవారం వెల్లడించింది. ముఖ్యంగా హిజ్బుల్లాపై దాడులు ఆగవని స్పష్టం చేసింది.
వివరాలు
ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్
గత ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సంయుక్త దాడి నిర్వహించాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమయ్యారు. దీనికి ప్రతిగా, ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇరాన్‌తో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంత తగ్గినప్పటికీ, లెబనాన్ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ తన వైఖరిని మార్చుకోలేదని స్పష్టమైంది.