Netanyahu: నెతన్యాహు ఫోన్‌తో అమెరికా-ఇరాన్ చర్చలకు బ్రేక్: టెహ్రాన్ ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగిన కీలక చర్చలు చివరికి ఫలితం లేకుండానే ముగిశాయి. చర్చలు కీలక దశలో కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చేసిన ఫోన్ కాల్ వల్లే ఈ చర్చలు నిలిచిపోయాయని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 21 గంటలకు పైగా సాగిన ఈ సమావేశాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగియడం గమనార్హం. ఈ పరిణామంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించారు. చర్చల మధ్యలో నెతన్యాహు వాన్స్‌కు ఫోన్ చేయడంతో అమెరికా-ఇరాన్ చర్చల దృష్టి ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లిందని ఆయన విమర్శించారు.
వివరాలు
అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్
యుద్ధం ద్వారా సాధించలేని విషయాలను అమెరికా చర్చల ద్వారా పొందాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాము చిత్తశుద్ధితో చర్చల్లో పాల్గొన్నామని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా, చర్చల సమయంలో అమెరికా తమ ముందుంచిన కొన్ని షరతులు ఆమోదయోగ్యం కాదని టెహ్రాన్ వర్గాలు తెలిపాయి. హర్మూజ్ జలసంధిలో తమ నౌకలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని, ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలను అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది.
వివరాలు
ముడి చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం
ఈ చర్చలు విఫలమవడంతో రెండు వారాల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. మరో తొమ్మిది రోజుల్లో ఈ ఒప్పందం గడువు ముగియనుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు పెరిగాయి. ఈ ప్రభావంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 డాలర్ల నుంచి మళ్లీ 119 డాలర్లను దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో అమెరికాకు మిత్రదేశాలైన స్పెయిన్, ఇటలీ వంటి దేశాల నుంచి కూడా మద్దతు తగ్గినట్లు సమాచారం.