LOADING...
Netanyahu: సగానికి పైగా మిషన్ పూర్తి: యుద్ధంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
సగానికి పైగా మిషన్ పూర్తి: యుద్ధంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Netanyahu: సగానికి పైగా మిషన్ పూర్తి: యుద్ధంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతుండటం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయంగా చర్చకు దారితీశారు. తాజాగా అమెరికన్ బ్రాడ్‌కాస్టర్ న్యూస్‌మాక్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ, ఈ యుద్ధంలో ఇప్పటివరకు సగానికి పైగా లక్ష్యాలను సాధించామని తెలిపారు. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, "మేము నిర్దేశించుకున్న మిషన్ల పూర్తిపై ఆధారపడి యుద్ధం ముగింపు ఉంటుంది" అని పేర్కొన్నారు.

వివరాలు 

ఇరాన్ అణు కార్యక్రమంపై పెద్ద దెబ్బ

ఇప్పటికే ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (రివల్యూషనరీ గార్డ్స్) కు చెందిన వేలాది మంది సైనికులను మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు. అంతేకాదు, ఇరాన్ ఆయుధ నిల్వలు, పారిశ్రామిక వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రత్యేకంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పెద్ద దెబ్బ కొట్టామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌లోని ఇస్లామిక్ పాలన త్వరలోనే అంతర్గతంగా కూలిపోవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే తమ లక్ష్యం పాలన మార్పు కాదని, కానీ ఆ దేశ సైనిక శక్తి, క్షిపణి సామర్థ్యం, అణు శక్తిని బలహీనపరచడం ద్వారా లోపల నుంచి దెబ్బతీయడమే తమ వ్యూహమని వివరించారు.

వివరాలు 

యుద్ధం మరికొన్ని వారాల్లోనే ముగిసే అవకాశం: మార్కో రూబియో

ఇదిలా ఉండగా,ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,నెతన్యాహు కలిసి ఈ సైనిక చర్యలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆసమయంలో ట్రంప్ ఈ ఘర్షణలు కేవలం 4 నుంచి 6 వారాల్లో ముగుస్తాయని చెప్పినా,ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇక అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం ఈయుద్ధం నెలల తరబడి సాగదని, మరికొన్ని వారాల్లోనే ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చమురుధరలు పెరగడంతో అమెరికాలో ప్రజలలో ఈయుద్ధంపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి,మధ్యప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకీ క్లిష్టంగా మారుతుండగా,ఈయుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది.

Advertisement