Netanyahu-Trump: నెతన్యాహు-ట్రంప్ చర్చలతో మళ్లీ ఇరాన్ యుద్ధ భయం.. 'ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్' మొదలవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆదివారం కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే జరిగిన కాల్పుల విరమణ దీర్ఘకాలిక శాంతికి దారి తీసేలా కనిపించకపోవడంతో.. అమెరికా-ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నాయన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి అంశం మళ్లీ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.
వివరాలు
"ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్" పేరుతో మరోసారి దాడులకు ప్రణాళిక
హిబ్రూ మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్ ఇటీవల చేసిన చైనా పర్యటన గురించీ ఇద్దరు నేతలు చర్చించారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ముగిసిందని అమెరికా ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు "ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్" పేరుతో మరోసారి దాడులకు ప్రణాళిక సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వివరాలు
సోషల్ మీడియాలో ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్
ట్రంప్‌తో ఫోన్ సంభాషణ అనంతరం నెతన్యాహు జెరూసలేం కార్యాలయంలో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి గిడియాన్ సార్, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో నేతన్యాహు మాట్లాడుతూ.. "ఇరాన్ పరిస్థితులపై మా దృష్టి ఎప్పుడూ ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం" అని వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ కూడా సోషల్ మీడియాలో ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధికారులు మంగళవారం అత్యవసర జాతీయ భద్రతా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
వివరాలు
చర్చనీయాంశమైన ట్రంప్ షేర్ చేసిన AI ఫోటో
ఇదే సమయంలో ట్రంప్ షేర్ చేసిన AI ఫోటో కూడా చర్చనీయాంశమైంది. సముద్రంలో యుద్ధ నౌకల మధ్య నిలబడి ఉన్న ట్రంప్ చిత్రంపై "తుఫాన్‌కు ముందు ప్రశాంతత" అనే వాక్యం కనిపించింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు.అమెరికా పెట్టిన కొన్ని ప్రధాన షరతులను ఇరాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 400కిలోల సమృద్ధి యురేనియంను అప్పగించడం,ఒక్క అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించడం వంటి డిమాండ్లను అమెరికా ముందుంచినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా ఆంక్షల ఎత్తివేత,నిలిపివేసిన ఆస్తుల విడుదల,యుద్ధనష్టాలకు పరిహారం వంటి షరతులను ఇరాన్ ప్రతిపాదించింది. భారత్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.."యుద్ధంతో శాంతి రాదు..చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం"అని వ్యాఖ్యానించారు.