Loading...
Neville Roy Singham: నిరసనలకు నిధుల ఆరోపణలు.. అమెరికా కాంగ్రెస్‌ దర్యాప్తు.. ఆర్థిక రికార్డులు ఇవ్వబోమన్న నెవిల్‌ రాయ్‌ సంస్థలు
ఆర్థిక రికార్డులు ఇవ్వబోమన్న నెవిల్‌ రాయ్‌ సంస్థలు

Neville Roy Singham: నిరసనలకు నిధుల ఆరోపణలు.. అమెరికా కాంగ్రెస్‌ దర్యాప్తు.. ఆర్థిక రికార్డులు ఇవ్వబోమన్న నెవిల్‌ రాయ్‌ సంస్థలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ దేశాల్లో నిరసనలకు నిధులు సమకూరుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా వ్యాపారవేత్త నెవిల్‌ రాయ్‌ సింగం‌కు చెందిన సంస్థలు ఆర్థిక రికార్డులను సమర్పించేందుకు నిరాకరించాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆర్థిక వివరాలను అందించాలని ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్‌ సహా పలు దేశాల్లో జరుగుతున్న నిరసనలకు ఈ సంస్థలు నిధులు అందిస్తున్నాయంటూ అమెరికా మీడియా పరిశోధనాత్మక కథనం ప్రచురించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతినిధుల సభలోని వేస్‌ అండ్‌ మీన్స్‌ కమిటీ ఆదేశాలను ది పీపుల్స్‌ ఫోరమ్‌ ఇంక్‌, బ్రేక్‌త్రూ న్యూస్‌ సంస్థలు తాజాగా తిరస్కరించాయి. తమ ఆర్థిక రికార్డులను అందించబోమని స్పష్టం చేశాయి.

వివరాలు 

అమెరికా చట్టసభ సభ్యుల దర్యాప్తు

నెవిల్‌ రాయ్‌ సింగంకు చెందిన సంస్థల నుంచి విదేశాలకు నిధులు తరలుతున్నాయనే ఆరోపణలపై కొంతకాలంగా అమెరికా చట్టసభ సభ్యులు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాతో పాటు పలు దేశాల్లో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సంస్థలు లక్షలాది డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించామని కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్న విద్యార్థుల నిరసన ఉద్యమానికి ఆజ్యం పోయడంలో బ్రేక్‌త్రూ న్యూస్‌కు సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఈ నెట్‌వర్క్‌ ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదని,అమెరికా,బ్రిటన్‌,గ్రీస్‌,బ్రెజిల్‌,భారత్‌ వంటి దేశాలకూ విస్తరించిందని అమెరికా కాంగ్రెస్‌ పేర్కొంది.

వివరాలు 

రాహుల్‌ గాంధీతో సంబంధాలు ఉన్నాయా?

నిరసనల్లో పాల్గొనేందుకు మద్దతుదారులను సమీకరించడం,సమ్మెలకు పిలుపునివ్వడం, అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా ప్రదర్శనలకు విస్తృత ప్రచారం కల్పించడం వంటి కార్యకలాపాల్లో ఈ సంస్థలు పాల్గొంటున్నాయని ఆరోపించింది.

భారత్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన నిరసనలు, గతంలో నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలకు నెవిల్‌ రాయ్‌ సింగం‌కు చెందిన సంస్థలతో సంబంధం ఉందా? అనే అనుమానాలను భాజపా వ్యక్తం చేస్తోంది.

విదేశీ పర్యటనల పేరుతో కాంగ్రెస్‌ అగ్రనేత దేశ వ్యతిరేక శక్తులను కలుస్తున్నారని భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే ఆరోపించారు.

భారత్‌ను అస్థిరపరిచేందుకు రాహుల్‌ గాంధీ కొన్ని శక్తులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు 

రాహుల్‌ గాంధీతో సంబంధాలు ఉన్నాయా?

మరోవైపు, భారత్‌లో చైనాకు అనుకూలంగా వార్తలను ప్రచారం చేసేందుకు నెవిల్‌ రాయ్‌ సింగంకు చెందిన సంస్థల నుంచి భారత వార్తా పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌కు కోట్లాది రూపాయల నిధులు అందాయని గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలు, దర్యాప్తు వివరాల నేపథ్యంలో నెవిల్‌ రాయ్‌ సింగంకు చెందిన సంస్థల ఆర్థిక కార్యకలాపాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

ADVERTISEMENT