LOADING...
New day, new gaffe: నకిలీ పిజ్జా షాప్‌ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి.. వీడియో ఇదిగో!
నకిలీ పిజ్జా షాప్‌ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి

New day, new gaffe: నకిలీ పిజ్జా షాప్‌ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి.. వీడియో ఇదిగో!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈసారి సియాల్‌కోట్‌లో ఓ నకిలీ పిజ్జా దుకాణాన్ని ప్రారంభించి చిక్కుల్లో పడ్డారు. ఆయన 'పిజ్జా హట్' పేరుతో ఉన్న దుకాణాన్ని ప్రారంభిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తించారు. దీనిపై స్పందించిన పిజ్జా హట్ పాకిస్థాన్,ఆ ప్రాంతంలో తమకు ఎలాంటి ఔట్‌లెట్ లేదని స్పష్టంచేసింది. సియాల్‌కోట్ కాంటోన్మెంట్‌లో అనధికారికంగా పిజ్జా హట్ పేరు,బ్రాండింగ్‌ను వాడుతూ ఓ దుకాణం తెరుచుకుందని సంస్థ తెలిపింది. ఈ ఔట్‌లెట్‌కు పిజ్జా హట్ పాకిస్థాన్ గానీ,యమ్! బ్రాండ్స్ గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

వివరాలు 

అధికారులకు ఫిర్యాదు చేసిన పిజ్జా హట్ యాజమాన్యం

అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి పిజ్జా హట్ వంటక విధానాలు, నాణ్యత ప్రమాణాలు, ఆహార భద్రతా నియమాలు ఇవేవీ ఈ దుకాణంలో పాటించట్లేదని పేర్కొంది. పిజ్జా హట్ యాజమాన్యం ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. తమ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం 16 పిజ్జా హట్ ఔట్‌లెట్లు మాత్రమే ఉన్నాయని, అందులో 14 లాహోర్‌లో, 2 ఇస్లామాబాద్‌లో ఉన్నాయని వెల్లడించింది. సియాల్‌కోట్ కాంటోన్మెంట్‌లో తమ ఔట్‌లెట్ లేదని స్పష్టంగా చెప్పడంతో, రక్షణ మంత్రి ఒక నకిలీ దుకాణాన్ని ప్రారంభించినట్టే అయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాలు 

దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా..

ఇదిలా ఉండగా, గతంలో కూడా ఖ్వాజా ఆసిఫ్ దేశానికి సంబంధించిన సున్నిత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన ప్రవర్తనపై ఎంపీ జర్తాజ్ గుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆమె, ఇంగ్లీష్ మాట్లాడలేని స్థితిలో ఉన్న రక్షణ మంత్రి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడకుండా సంయమనం పాటించాలని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను ఆధారంగా చూపిస్తూ ఉగ్రవాదులతో దేశానికి ఉన్న సంబంధాలపై ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలే ఈ అసంతృప్తికి కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, మరోసారి పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన గాఫ్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సియాల్ కోట్ లో ఘనంగా పిజ్జా హట్ ఔట్ లెట్ ప్రారంభోత్సవం

Advertisement