న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం; నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు
మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 0.1శాతం క్షీణించిన నేపథ్యంలో సాంకేతికంగా న్యూజిలాండ్ మాంద్యంలోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ స్థూల దేశీయోత్పత్తి మొదటి త్రైమాసికంలో 0.1శాతం పడిపోయిందని గురువారం వెల్లడించిన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకొన్నది. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ 2022 చివరి నాటికి 0.7 శాతం పతనమైన తర్వాత, ఇప్పుడు మాంద్యంలోకి వెళ్లడం అంత ఆశ్చర్యకర విషయమేమి కాదని సెంటర్-లెఫ్ట్ ఆర్థిక శాఖ మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ అన్నారు.
2020 తర్వాత ఇదే మొదటి మాంద్యం
గ్లోబల్ వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం ఎక్కువగా ఉండటం, నార్త్ ఐలాండ్ వాతావరణ సంఘటనల ప్రభావాల వల్ల వ్యాపారాలకు అంతరాయం కలిగించడం వంటి పరిస్థితులతో 2023 ఏడాది తమకు ఒక సవాలు మారుతుందని తమకు తెలుసునని ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ పేర్కొన్నారు. ఆక్లాండ్‌లో జనవరిలో వచ్చిన వరదలు, ఫిబ్రవరిలో గాబ్రియెల్ తుఫాను కారణంగా సంభవించిన విధ్వంసం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. తీవ్రమైన వాతావరణం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చేందుకు 9 మిలియన్ అమెరకా డాలర్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2020లో కరోనా మహమ్మారి వల్ల సరిహద్దులను మూసివేసి ఎగుమతులను నిలివేసిన తర్వాత, న్యూజిలాండ్‌లో ఇదే మొదటి మాంద్యం కావడం గమనార్హం.