New Zealand: భారత్‌లో వీసా సర్వీస్ ఫీజులు పెంచిన న్యూజిలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ వీసా దరఖాస్తుదారులకు సంబంధించిన సర్వీస్ ఫీజులు పెరగనున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా 2026 జనవరి 1 నుంచి కొన్ని వీసా అప్లికేషన్ సెంటర్లు (VACలు) వసూలు చేసే సర్వీస్ ఫీజులను పెంచనున్నట్లు ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ ప్రకటించింది. ఈ మార్పు భారత్‌తో పాటు మరో 25 దేశాల్లోని వీసా దరఖాస్తుదారులకు వర్తించనుంది. ఈ సవరించిన రుసుము కేవలం VACలు వసూలు చేసే సేవా ఫీజుకు మాత్రమే వర్తిస్తుందని, ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్‌కు చెల్లించే అసలు వీసా అప్లికేషన్ ఫీజుతో దీనికి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల చేపట్టిన సిస్టమ్ అప్‌గ్రేడ్ల తరువాత ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సేవలు నిరంతరంగా కొనసాగించేందుకు ఈ పెంపు అవసరమైందని తెలిపారు.
వివరాలు
వీసా దరఖాస్తు సమర్పించే ముందు సరైన ఫీజు ఎంతనేది తప్పకుండా పరిశీలించాలి: ఇమ్మిగ్రేషన్ శాఖ
వీసా దరఖాస్తు సమర్పించే ముందు సరైన ఫీజు ఎంతనేది తప్పకుండా పరిశీలించాలని ఇమ్మిగ్రేషన్ శాఖ అభ్యర్థులను సూచించింది. ఇందుకోసం అధికారిక ఆన్‌లైన్ ఫీజు చెకింగ్ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు లేదా VFS గ్లోబల్ సహా సంబంధిత VAC వెబ్‌సైట్లను సందర్శించి తాజా చార్జీలను నిర్ధారించుకోవాలని తెలిపింది. సర్వీస్ ఫీజు పెరుగుతున్న దేశాలు, ప్రాంతాల్లో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌తో పాటు ఆసియా, పసిఫిక్, యూరప్, మధ్యప్రాచ్యంలోని మరికొన్ని దేశాలు ఉన్నాయి.
వివరాలు
న్యూజిలాండ్ మరో హెచ్చరిక జారీ
ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ దరఖాస్తులపై ప్రభావం చూపే సాంకేతిక సమస్యలపై కూడా ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల జరిగిన సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా కొందరు దరఖాస్తుదారులకు లేఖలు, పత్రాలు చూడడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. "ఇటీవలి సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు చెబుతున్నాం" అని పేర్కొంది. రాబోయే వారాల్లో న్యూజిలాండ్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు పెరిగిన సర్వీస్ ఫీజును పరిగణలోకి తీసుకోవాలని, దరఖాస్తు సమర్పించే ముందు అధికారిక సమాచార మార్గాల ద్వారా తాజా అప్‌డేట్లను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.