Epstein photos: అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం.. ఎప్‌స్టీన్‌తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్'కు సంబంధించిన మరిన్ని ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలంటూ న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై తాను ఇటీవలే సంతకం చేశానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనకు మధ్యలోనే,యూఎస్ హౌస్ డెమొక్రాట్లు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్‌కు చెందిన 68 ఫొటోలను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విడుదలైన ఈ ఫొటోల్లో అనేక మంది అత్యంత ప్రముఖులు కనిపించడం విశేషంగా మారింది. ఈ చిత్రాల్లో హై-ప్రొఫైల్ వ్యక్తులకు సంబంధించిన వివరాలు,పాస్‌పోర్టులు, పలు కీలక పత్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం నాటికి పూర్తి స్థాయి ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను న్యాయశాఖ ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
వివరాలు
తాజా చిత్రాల విడుదలతో న్యాయశాఖపై మరింత ఒత్తిడి
గురువారం రోజున హౌస్ డెమొక్రాట్లు విడుదల చేసిన ఈ 68 ఫొటోల్లో ఎక్కువగా ఇప్పటివరకు బయటకు రాని కొత్త వ్యక్తులు కనిపించారని తెలిపారు. ఈ తాజా చిత్రాల విడుదలతో న్యాయశాఖపై ఒత్తిడి మరింత పెరిగింది. ఫొటోల్లో బిల్ గేట్స్, నోమ్ చోమ్స్కీ, స్టీవ్ బానన్, ప్రముఖ దర్శకుడు వుడీ అలెన్ వంటి హై-ప్రొఫైల్ వ్యక్తులు కనిపించడం మరింత చర్చకు దారి తీసింది. కొన్ని చిత్రాల్లో గుర్తుపట్టలేని మహిళ పక్కన బిల్ గేట్స్ నిలబడి ఉన్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
వివరాలు
పత్రాలు, వ్యక్తిగత రికార్డులు
ఈ తాజా ఫొటోల్లో అనేక కీలక పత్రాలు, వ్యక్తిగత రికార్డులు కనిపించాయి. రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా, దక్షిణాఫ్రికా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, వీసాలు, గుర్తింపు కార్డులు, సున్నితమైన వ్యక్తిగత వివరాలు వీటిలో ఉన్నాయి. అంతేకాదు, కొన్ని పత్రాల్లో 'స్త్రీ' అని ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం.
వివరాలు
ఇతర అంశాలు
కొన్ని చిత్రాల్లో యువతులకు సంబంధించిన టెక్ట్స్ సందేశాల స్క్రీన్‌షాట్‌లు కూడా ఉన్నాయి. ''ఒక స్నేహితురాలు కొంతమంది అమ్మాయిలను పంపింది. ఒక్కొక్కరు డబ్బు కోరుతున్నారు'' అనే విధమైన సందేశాలు అందులో కనిపిస్తున్నాయి. అయితే ఫొటోల్లో ఎవరి చిత్రం కనిపించినంత మాత్రాన వారు నేరానికి పాల్పడ్డారని భావించరాదని హౌస్ డెమొక్రాట్లు స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌తో కలిసి నేరం చేసినట్లు ఈ ఫొటోలు నిరూపించవని వారు పేర్కొన్నారు.
వివరాలు
ఇతర అంశాలు
బాధితుల గోప్యతకు భంగం కలగకుండా పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. మహిళలు, బాలికల ముఖాలను పూర్తిగా దాచిపెట్టినట్లు వెల్లడించారు. బాధితులను రక్షిస్తూ, ప్రజలకు పారదర్శకత కల్పించడమే ఈ ఫొటోల విడుదల లక్ష్యమని హౌస్ డెమొక్రాట్లు వివరించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై 2019 జులైలో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు నమోదు చేశారు. అయితే కేసు విచారణ ప్రారంభమయ్యేలోపే, మాన్‌హాటన్ జైలులోని తన గదిలో అతడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.