LOADING...
US-Iran: ఇరాన్‌కు భారీ ఊరట.. ఆంక్షల సడలింపు.. 300 బిలియన్ డాలర్ల ఫండ్‌పై అమెరికా అంగీకారం?
ఇరాన్‌కు భారీ ఊరట.. ఆంక్షల సడలింపు.. 300 బిలియన్ డాలర్ల ఫండ్‌పై అమెరికా అంగీకారం?

US-Iran: ఇరాన్‌కు భారీ ఊరట.. ఆంక్షల సడలింపు.. 300 బిలియన్ డాలర్ల ఫండ్‌పై అమెరికా అంగీకారం?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 17, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరినట్లు చెబుతున్న రహస్య అవగాహన ఒప్పందం (MoU)కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగడం, హోర్ముజ్ జలసంధి నిర్వహణలో ఇరాన్‌కు పాత్ర కల్పించడం, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇవ్వడం, అలాగే సమగ్ర శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం పూర్తి పాఠ్యాన్ని అధికారికంగా విడుదల చేయలేదు. అయితే బ్లూమ్‌బర్గ్ న్యూస్, అల్ అరేబియా సంస్థలు 14 అంశాలతో కూడిన ఈ MoU ప్రతిని ప్రచురించినట్లు పేర్కొన్నాయి.

వివరాలు

వెలుగులోకి వచ్చిన విషయాలివే..

వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి స్పష్టమైన పరిష్కారం ఈ ఒప్పందంలో కనిపించలేదు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయదని, పొందదని హామీ ఇచ్చింది. అలాగే టెహ్రాన్ వద్ద ఉన్న అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించడం లేదా ధ్వంసం చేయడం వంటి అంశాలపై మరింత చర్చించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం MoUపై సంతకాలు జరిగిన తర్వాత ప్రారంభమయ్యే 60 రోజుల చర్చల కాలంలో ఈ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ ఒప్పంద రూపకల్పనలో ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, మధ్యప్రాచ్యంలో సముద్ర భద్రత, అలాగే అమెరికా బలగాల క్రమంగా ఉపసంహరణకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.

వివరాలు

ఒప్పందంలో ఏముందంటే?

ఒప్పందం ప్రకారం "లెబనాన్ సహా అన్ని రంగాల్లో యుద్ధానికి తక్షణం మరియు శాశ్వత ముగింపు" ప్రకటించబడింది. అమెరికా, ఇరాన్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్న వారి మిత్రదేశాలు ఇకపై పరస్పరం ఎటువంటి శత్రుత్వ చర్యలకు పాల్పడబోవని, బలప్రయోగం లేదా బలప్రయోగ బెదిరింపులకు దూరంగా ఉంటాయని ఇందులో పేర్కొన్నారు. ఒప్పందంలో ఇజ్రాయెల్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, "మిత్రదేశాలు" అనే పదం వాడటం ద్వారా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నిలుపుదల కూడా ఇందులో భాగమై ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ ఒకరి సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించాలని, పరస్పర అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కూడా ఒప్పందంలో పేర్కొన్నారు.

Advertisement

వివరాలు

అమెరికా ఇచ్చిన హామీలు ఇవే..

MoUపై సంతకాల అనంతరం గరిష్ఠంగా 60 రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్ తుది శాంతి ఒప్పందంపై చర్చలు పూర్తి చేయాలని నిర్ణయించారు. పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా అమలు చేస్తున్న సముద్ర దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని పేర్కొన్నారు. అలాగే తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30 రోజుల్లోపు పరిసర ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా హామీ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

వివరాలు

ఇరాన్ ఏం చర్యలు తీసుకోనుంది?

మరోవైపు, హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి తిరిగి చేరుకునేలా ఇరాన్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. పెర్షియన్ గల్ఫ్ నుంచి ఒమాన్ సముద్రం వరకు, అలాగే తిరుగు మార్గంలో వాణిజ్య నౌకల రవాణా 30 రోజుల్లో సాధారణ స్థితికి చేరేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇరాన్ పునరుద్ధరణ, ఆర్థిక అభివృద్ధి కోసం అమెరికా, దాని ప్రాంతీయ మిత్రదేశాలు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కూడా ఈ ఒప్పందం సూచిస్తోంది. ఈ ప్రణాళికకు కనీసం 300 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చాలని పేర్కొన్నారు.

వివరాలు

దశలవారీగా అమలు..

తుది ఒప్పందంలో భాగంగా ఈ ప్రణాళిక అమలు విధానాన్ని 60 రోజుల్లో ఖరారు చేయనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అలాగే ఇరాన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా కట్టుబడి ఉంటుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) గవర్నర్ల బోర్డు చర్యలు, అలాగే అమెరికా విధించిన ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆంక్షల ఎత్తివేత తుది ఒప్పందంలో నిర్ణయించే షెడ్యూల్ ప్రకారం దశలవారీగా అమలు చేయనున్నట్లు సమాచారం.

Advertisement