Kim Jong Un: ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ప్రజలు కఠినమైన ఆంక్షలు, చిన్న తప్పిదాలకు కూడా తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నారు. ఇటీవల, భారీ వర్షాలు,వరదల కారణంగా ఉత్తరకొరియా తీవ్ర పరిస్థితే ఎదుర్కొంది. ఈ సందర్భంలో, విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు పై కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులపై మరణశిక్ష అమలు చేయాలని ఆయన ఆదేశించారని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
విధుల నుంచి కాంగ్ బాంగ్ హూన్ తొలగింపు
దక్షిణ కొరియా మీడియా ఒక కథనంలో, అవినీతి, విధుల్లో నిర్లక్ష్యానికి గురైన 20-30 మంది అధికారులకు గత నెలలో మరణశిక్ష విధించారన్న విషయాన్ని ముందుగా వెల్లడించింది. ఆ తర్వాత, ఈ శిక్షను అమలు చేసినట్లు కూడా చెప్పింది. అయితే, అధికారికంగా ఈ శిక్ష అమలుపై ఎలాంటి స్పష్టత లేదు. శిక్షకు గురైన అధికారుల వివరాలు బయటకు రాలేదు. చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా శిక్షకు గురైన వారిలో ఉన్నారని సమాచారం. విపత్తు సమయంలో, కిమ్ జోంగ్ ఉన్ ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, హూన్‌ను విధుల నుంచి తొలగించారు.
విపత్తు ప్రదేశాలలో పర్యటించిన కిమ్ జోంగ్ ఉన్
జులై-ఆగస్టు మధ్య ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో, వరదలు, బురదచరియలు అనేక ఊర్లను తుడిచివేసాయి. ఈ విపత్తులో దాదాపు 4,000 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో, కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా విపత్తు ప్రదేశాలను పర్యటించారు. మోకాలిలోతు నీటిలో కారు నడపడం, బోటులో సహాయక చర్యలను పర్యవేక్షించడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. కిమ్ రాజ్యంలో ఇలాంటి శిక్షలు సాధారణమైనవి. 2019లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ జోంగ్ ఉన్ చర్చలు సరిగా నిర్వహించకపోవడంతో, ఉత్తరకొరియా అణు రాయబారి కిమ్ హోక్ చోల్‌ను మరణశిక్షకు గురిచేశారు.