North Korea: ఉత్తరకొరియా సరికొత్త అస్త్రం.. తొలిసారి 600 మి.మీ. స్నైపర్ ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియా తన సైనిక, రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆయుధాల తయారీలో కృత్రిమ మేధ (AI) సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఆయుధాలతో పాటు తాజాగా 600 మి.మీ. సామర్థ్యం కలిగిన 'స్నైపర్' మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను తొలిసారిగా ప్రదర్శించింది. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా ఫైరింగ్ పరీక్షలు కూడా నిర్వహించింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. శత్రువుల స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల సామర్థ్యం ఉండటంతో ఈ రాకెట్ లాంచర్‌కు 'స్నైపర్' అని పేరు పెట్టినట్లు ఉత్తరకొరియా చెబుతోంది.
వివరాలు
నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం కచ్చితత్వంతో ఛేదించగలదు
నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం కచ్చితత్వంతో ఛేదించగలదని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.
ఒకవేళ ఈ ఆయుధాలను దక్షిణ కొరియా సరిహద్దుల్లో మోహరిస్తే.. ఆ దేశం మొత్తం వీటి దాడుల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఆయుధ ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలను ఉత్తరకొరియా మీడియా విడుదల చేసింది.
వాటిలో 10కి పైగా స్నైపర్ రాకెట్ లాంచర్లు ఒకేసారి ఫైరింగ్ చేయడం కనిపించింది.
అలాగే డ్రోన్ల ద్వారా క్షిపణులను ప్రయోగించడం,దక్షిణ కొరియా సైనిక పోస్టులు,అమెరికా అబ్రహాం ట్యాంకులను పోలిన నమూనాలను ఏర్పాటు చేసి వాటిపై ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేయడం వంటి దృశ్యాలు ఉన్నాయి.
వివరాలు
బలమైన సైనిక సామర్థ్యం ఉంటేనే శాంతి
ఈ ప్రదర్శన ద్వారా తమ సైనిక సామర్థ్యంతో పాటు డ్రోన్ యుద్ధ సాంకేతికతను కూడా ఉత్తరకొరియా ప్రదర్శించింది.
ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి ఆధిపత్యాన్ని సాధించే దిశగా పనిచేయాలని కిమ్ జోంగ్ ఉన్ సైనిక బలగాలకు పిలుపునిచ్చారు.
ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి, గందరగోళ పరిస్థితుల్లో మనుగడ సాగించాలంటే అవసరమైన విచక్షణతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
బలమైన సైనిక సామర్థ్యం ఉంటేనే శాంతిని కాపాడుకోవడం సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.