North Korea: ఉత్తర కొరియా డ్రోన్ వరుస.. దక్షిణాది రవాణామార్గాలు పేల్చివేయడానికి సిద్ధంగా ఉందని సియోల్ ఆరోపణ
దక్షిణ కొరియాతో కయ్యానికి కాలుదువ్వేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా, దక్షిణ కొరియాతో అనుసంధానించే రోడ్లు,రైల్వే మార్గాలను సోమవారం ఉదయం ధ్వంసం చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇప్పటికే ఉత్తరకొరియా, తమ రవాణా మార్గాలను నాశనం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. యుద్ధం వేళ, సియోల్ దళాలు తమ దేశంలోకి చొచ్చుకురాకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానిస్తున్నారు. పొరుగు దేశం తమపై డ్రోన్లు పంపిస్తోందనే ఆగ్రహంతో కిమ్ సర్కారు ఈ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారీగా కేమోఫ్లాజ్‌లు ఏర్పాటు చేసుకొని, ఆ దేశ దళాలు రోడ్ల ధ్వంసానికి ఏర్పాట్లు చేస్తున్నాయని దక్షిణ కొరియా సైన్యం సోమవారం తెలిపింది.
దాడికి మా దళాలు సిద్ధం..
సియోల్‌కు చెందిన డ్రోన్లు తమ గగనతలంలోకి చొరబడినా, కరపత్రాలు జారవిడిచినా, ఆ దేశంపై దాడి చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ మేరకు, ఆ దేశ రక్షణశాఖ ఓ ప్రకటన చేసింది. శతఘ్ని దళం సహా ఇతర కీలక యూనిట్లను ఇప్పటికే సరిహద్దుల్లోకి పంపినట్లు పేర్కొంది. కిమ్ సోదరి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, దక్షిణ కొరియా మాత్రం డ్రోన్లు పంపడంపై నోరు మెదిపేందుకు నిరాకరించింది.
చెత్త బెలూన్లకు జీపీఎస్..!
ఉత్తరకొరియా తరచూ పంపించే చెత్త బెలూన్ల వెనక పెద్ద ప్లాన్ ఉంది.ఈ విషయాన్ని ఆలస్యంగా దక్షిణ కొరియా దళాలు గుర్తించాయి. ఈ బుడగలకు జీపీఎస్ పరికరాలను అమర్చి పంపిస్తున్నట్లు గుర్తించారు.తమకు అనుకున్న ప్రదేశంలోనే చెత్తను పారేయడానికి వీలుగా వీటిని అమర్చినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6,000 బెలూన్లను దక్షిణ కొరియాపైకి వదిలింది. వీటిల్లో కొన్నింటి శకలాలను దక్షిణ కొరియా సైన్యం సేకరించి విశ్లేషించగా,అందులో జీపీఎస్ పరికరాలున్నట్లు గుర్తించింది. ఇప్పటివరకు కిమ్ సర్కారు వీటిపై 4,44,148 డాలర్లు వెచ్చించినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి, ఇవి దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారాయి.
ఉత్తరకొరియాలో డ్రోన్లలో కరపత్రాలు..
ఆ బెలూన్ల కారణంగా, జూన్ నుంచి తమ రాజధాని సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని ఆ దేశ చట్టసభ సభ్యులు ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు, దక్షిణ కొరియా కూడా డ్రోన్లలో కరపత్రాలు ఉంచి, ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో వెదజల్లిస్తోంది. కానీ, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు.