Benjamin Netanyahu: నెస్సెట్‌లో మోడీ మాటలు.. చెమ్మగిల్లిన ఇజ్రాయిల్ కళ్లూ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయిల్ పార్లమెంట్ నెస్సెట్(Knesset)లో మోడీ చేసిన ప్రసంగం అక్కడి ప్రజల మనసులను కదిలించిందని ఆయన తెలిపారు. ఆ ప్రసంగం విన్న ప్రతి ఇజ్రాయిలీ భావోద్వేగానికి లోనై, కళ్లలో నీళ్లు తెచ్చుకున్నారని నెతన్యాహూ పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగిన మోడీ పర్యటన వ్యవధి పరంగా చిన్నదైనా, హృదయాలను తాకిన ప్రత్యేకమైన సందర్శనగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
భారత్-ఇజ్రాయిల్ దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు
"ఇది గొప్ప పర్యటన. అద్భుతమైన సందర్శనకు అద్భుతమైన ముగింపు లభించింది. నిన్న నెస్సెట్‌లో మీరు చేసిన హృదయానికి హత్తుకునే ప్రసంగం తర్వాత ఇజ్రాయిల్‌లో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారని నేను భావిస్తున్నాను" అని నెతన్యాహూ అన్నారు. భారత్-ఇజ్రాయిల్ దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీకి ఇది రెండో ఇజ్రాయిల్ పర్యటన. తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో రెండోసారి ఆ దేశాన్ని సందర్శించారు.
వివరాలు
గాజాలో శాంతి నెలకొనేందుకు భారత్ పూర్తి మద్దతు
అంతకుముందు 2017లో ఆయన ఇజ్రాయిల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు ఇజ్రాయిల్ పార్లమెంట్ నెస్సెట్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిని "అనాగరిక చర్య"గా అభివర్ణించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని కట్టడి చేసి ఖండించాల్సిందే అని స్పష్టం చేశారు. గాజాలో శాంతి నెలకొనేందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.