Nvidia CEO Jensen Huang: పరిచయం కాదట.. చైనా గూఢచారితో ఎన్విడియా సీఈఓకు సన్నిహిత సంబంధాలు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా ఓ మహిళను గూఢచారిగా నియమించుకుందని, ఆమె ద్వారా కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తోందని ఇటీవల వెలువడిన కథనాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు, జెన్సన్ హువాంగ్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అమెరికా అధికారులు అనుమానిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికా అధికారులు ఈ అంశంపై ఓ మెమోను సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి.
వివరాలు
అమెరికా నిఘా సంస్థలు గుర్తించినట్లు సమాచారం
చైనా జాతీయురాలైన అలైస్ హువాంగ్ అలియాస్ హువాంగ్ లీ అనే మహిళను ఆ దేశ గూఢచారిగా అమెరికా నిఘా సంస్థలు గుర్తించినట్లు సమాచారం.
చైనీస్ ఇన్వెస్టర్‌గా ఉన్న ఆమె ప్రస్తుతం సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ కంపెనీ 'మెగాస్పీడ్'లో కీలక ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.
అమెరికా విధించిన ఆంక్షలను తప్పించుకుని ఎన్విడియాకు చెందిన ఏఐ చిప్‌లను ఈ సంస్థ చైనాకు తరలిస్తోందనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో బైడెన్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది.
ఆ దర్యాప్తు క్రమంలోనే అలైస్ హువాంగ్ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయని ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి.
వివరాలు
చైనాకు చేరవేసినట్లు ఆ కథనాలు వెలువడ్డాయి
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఆమె పరిచయం పెంచుకుని, సంస్థకు చెందిన ఏఐ చిప్‌లు, కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించి చైనాకు చేరవేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
అయితే, వారిద్దరి మధ్య ఉన్నది కేవలం పరిచయం మాత్రమే కాదని, సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అమెరికా అధికారులు సిద్ధం చేసిన మెమోలో ఆరోపించినట్లు సమాచారం.
చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, ఆ దేశ ప్రధాన పౌర నిఘా సంస్థ అలైస్ హువాంగ్‌ను గూఢచారిగా నియమించుకున్నాయని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
రహస్యంగా ప్రశ్నించేందుకు సన్నాహాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించడానికి ముందు ప్రభుత్వంలోని కొద్దిమంది ఉన్నతాధికారుల మధ్య ఈ మెమో చక్కర్లు కొట్టినట్లు సమాచారం.
ఇటీవల జెన్సన్ హువాంగ్ చైనా లక్ష్యంగా మారారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ సభ్యులు ఆయనను హౌస్ కమిటీల ముందు రహస్యంగా ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో తాజాగా ఆయనకు, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ మెమోలో పేర్కొన్న అంశం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
ట్రంప్‌కు ముందే సమాచారం
మరోవైపు ఈ గూఢచర్య వ్యవహారం గురించి ట్రంప్‌కు ముందే సమాచారం ఉన్నప్పటికీ, ఎన్విడియా వ్యాపార కార్యకలాపాలు, చైనాతో అమెరికా వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవద్దని ఆయన భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే, మెగాస్పీడ్ సంస్థతో తమ వ్యాపార సంబంధాల విషయంలో ఎన్విడియా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్‌పై వచ్చిన ఆరోపణలు, చైనా గూఢచర్య అనుమానాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.