North Korea: కిమ్ పర్యవేక్షణలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ పరీక్షలు.. ఉత్తర కొరియాపై ప్రపంచ దృష్టి!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియా మరోసారి అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాజాగా 600 ఎంఎం క్యాలిబర్ కలిగిన 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఈ వారం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా వరుసగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది. దీనికి ప్రతిస్పందనగా ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించినట్లు సమాచారం. ఈ కొత్త రాకెట్ లాంచర్లు దాదాపు 420కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని కేసీఎన్‌ఏ తెలిపింది. అలాగే టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాల శక్తి, వినియోగంపై అవగాహన కోసం కూడా ఈ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది.
Details
ఉత్తర కొరియా మరో బల ప్రదర్శన
ఈ పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటు దేశ వారసురాలిగా భావిస్తున్న కిమ్ జుయే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షల సమయంలో సుమారు 364 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ద్వీపంలోని లక్ష్యాన్ని గురి పెట్టి రాకెట్ ప్రయోగించగా, అది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఇదిలా ఉండగా, శనివారం ఉత్తర కొరియా మరో బల ప్రదర్శన చేసింది.
Details
రక్షక దళం అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సూచనలు జారీ
రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అయితే అవి ఎంత దూరం ప్రయాణించాయన్న విషయంపై పూర్తి సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది. మరోవైపు క్షిపణి ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే జపాన్ ప్రధాని కార్యాలయం అత్యవసర స్పందన చర్యలను ప్రారంభించింది. క్షిపణి పరీక్షల అనంతరం సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు జపాన్ తీర రక్షక దళం అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సూచనలు జారీ చేసింది.