Russia Missile: అణుశక్తితో నడిచే 'బూరెవెస్ట్‌నిక్' పరీక్ష విజయవంతం.. రష్యా చేతిలో నూతన అస్త్రం!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా సైనిక శక్తిని మరింత బలపరచే దిశగా మరో కీలకమైన అస్త్రం సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి 'బూరెవెస్ట్‌నిక్ (Burevestnik)'ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అపరిమిత పరిధి (unlimited range) కలిగిన ఈ క్షిపణి మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటును తక్షణమే పూర్తి చేయాలని ఆయనే సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రష్యా సైన్యం విస్తృత స్థాయిలో 'అణు విన్యాసాలు' నిర్వహించింది. ఆ విన్యాసాలను స్వయంగా పుతిన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన రష్యా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు ఇతర సీనియర్ సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు.
Details
సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా
ఆ సమావేశంలో మాట్లాడుతూ 'బూరెవెస్ట్‌నిక్' క్షిపణి పరీక్ష సమయంలో 15గంటలపాటు గాల్లో తేలుతూ 14వేల కిలోమీటర్లు ప్రయాణించిందని వెల్లడించారు. దీనికి ముందు కూడా పుతిన్ రష్యా సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా గెరాసిమోవ్ మాట్లాడుతూ, రష్యా దళాలు ఇటీవల 10వేల మందికిపైగా ఉక్రెయిన్ సైనికులను చుట్టుముట్టినట్లు వివరించారు. 31మంది బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్ సాయుధ దళాల బృందాన్ని అడ్డుకున్నామని వెల్లడించారు. మొత్తం మీద, రష్యా తాజా అణు విన్యాసాలు, బూరెవెస్ట్‌నిక్ క్షిపణి విజయవంతమైన పరీక్ష, ఇవి రెండూ కలిసి ఆ దేశం సైనిక సామర్థ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చాయని చెప్పొచ్చు.