LOADING...
Netanyahu: ట్రంప్‌తో అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రంప్‌తో అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Netanyahu: ట్రంప్‌తో అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు కొన్నిసార్లు విభేదాలేర్పడతాయని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఒక పత్రికా సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు, అమెరికా-ఇరాన్ ఒప్పందంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. నాకు, ట్రంప్‌కు మధ్య అప్పుడప్పుడు విభేదాలు వస్తుంటాయి. అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. అది ఆయన నిర్ణయం. మాకు మా జాతీయ ప్రయోజనాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

వివరాలు

ఇరాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోకుండా ఉండటమే లక్ష్యం

ఇరాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోకుండా చూడటమే తన ప్రధాన లక్ష్యమని నెతన్యాహు స్పష్టం చేశారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉంటానన్నారు. శాంతి ఒప్పందం ఉన్నా, లేకున్నా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండే పరిస్థితిని అనుమతించమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని నెతన్యాహు అన్నారు. అంతేకాకుండా ఆ దేశ సైనిక పరిశ్రమలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయని తెలిపారు. ఈ నష్టం విలువ వందల బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

వివరాలు

ఘర్షణ పూర్తిగా ముగిసిపోలేదు

అయితే ఘర్షణ పూర్తిగా ముగిసిపోయిందని భావించరాదని నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అదనంగా 350 బిలియన్ షెకెళ్ల (ఇజ్రాయెల్ కరెన్సీ) నిధులను రక్షణ వ్యయానికి కేటాయిస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు.

Advertisement