LOADING...
Kuwait: కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్
కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్

Kuwait: కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కువైట్‌ (Kuwait) సమీప జలాల్లో ఒక చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కారణంగా ట్యాంకర్ నుంచి ఇంధనం సముద్రంలోకి లీక్ అయ్యిందని వెల్లడైంది. ఈ విషయాన్ని గురువారం బ్రిటన్‌కు చెందిన మారిటైమ్‌ భద్రతా సంస్థ ప్రకటించింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,కువైట్‌లోని ముబారక్ అల్‌ కబీర్‌ పోర్ట్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ పేలుడు జరిగిన కొద్ది సేపటికే ఆ ప్రాంతం నుంచి ఒక చిన్న పడవ వేగంగా వెళ్లిపోతున్నట్టు వారు గమనించినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఎగుమతులు నిలిపివేయండి: చైనా

ట్యాంకర్ నుంచి బయటకు వచ్చిన ఇంధనం సముద్ర జలాల్లో కలవడం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని మారిటైమ్‌ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. ఇదిలా ఉండగా,డీజిల్‌,గాసోలిన్‌ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని చైనా తన రిఫైనరీలకు సూచించినట్లు సమాచారం. మరోవైపు, గల్ఫ్‌ దేశాలకు అందిస్తున్న సేవలను కొంతకాలం నిలిపివేస్తున్నట్లు చైనాకు చెందిన ప్రముఖ షిప్పింగ్‌ సంస్థ COSCO ప్రకటించింది. అదే సమయంలో ఇరాన్‌,ఇజ్రాయెల్‌,అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఆరో రోజుకు చేరుకున్నాయి.

వివరాలు 

అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలకు.. ఇరాన్‌ హెచ్చరికలు జారీ

విశాఖపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించిన ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐరిస్‌ దేనా-75 ను అమెరికా తన జలాంతర్గామి ద్వారా దాడి చేసి ముంచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఇరాన్‌ తీవ్రంగా పరిగణించి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు జరిపింది. ఇంకా, పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలకు చెందిన సైనిక, ఆర్థిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement