A Dark Night: 'గోయింగ్ డార్క్' వ్యూహంతో హర్మూజ్ దాటి భారత్ చేరిన షెన్‌లాంగ్ నౌక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒక కీలక చమురు నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని పరిస్థితుల్లోనూ ప్రమాదకర వాతావరణాన్ని ఎదుర్కొంటూ ముంబయి పోర్ట్‌కు చేరుకున్న తొలి క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఇదే. ఈ నౌకను నడిపిన కెప్టెన్ కూడా భారతీయుడే కావడం విశేషం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ నౌక తన గమ్యస్థానాన్ని ఎలా చేరుకుంది అన్నది ఆసక్తికరంగా మారింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ చమురు ట్యాంకర్ బుధవారం ముంబయి నౌకాశ్రయానికి చేరుకుంది. ఇది మూడురోజుల కిందటే హర్మూజ్ జలసంధిని దాటింది. తన ప్రయాణాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు నౌక సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు.
వివరాలు
మార్చి 8న హర్మూజ్ వద్ద ఈ నౌక సిగ్నల్స్
మార్చి 1న ఈ ట్యాంకర్ సౌదీ అరేబియా పోర్ట్ వద్ద చమురును లోడ్ చేసుకుంది. మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకారం మార్చి 8న హర్మూజ్ వద్ద ఈ నౌక సిగ్నల్స్ కనిపించాయి. ఆ తర్వాత ఒక్కసారిగా అది ట్రాకింగ్ వ్యవస్థల నుంచి కనిపించకుండా పోయింది. నౌకలోని సిబ్బంది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS), ట్రాన్స్‌పాండర్లను స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.
వివరాలు
'గోయింగ్ డార్క్' వ్యూహం
ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిన హర్మూజ్ జలసంధిలో గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు నౌక సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణం ప్రారంభించిన తర్వాత, అంటే దాదాపు ఒకరోజు తరువాత మళ్లీ ట్రాకింగ్ సిస్టమ్స్‌లో ఈ నౌక కనిపించింది. సంక్షోభ పరిస్థితుల్లో ప్రత్యర్థుల దృష్టికి చిక్కకుండా ఉండేందుకు షిప్పింగ్ కంపెనీలు ఇలాంటి ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తుంటాయి. ఈ విధానాన్ని 'గోయింగ్ డార్క్' అని పిలుస్తారు. అయితే అంతర్జాతీయ సముద్రయాన నిబంధనల ప్రకారం భద్రత,రియల్‌టైమ్ ట్రాకింగ్ కోసం ఏఐఎస్ వ్యవస్థ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. ఇప్పుడీ షెన్‌లాంగ్ ట్యాంకర్ ముంబయికి చేరేటప్పుడు సుమారు 1,35,335 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ను తీసుకొచ్చింది.
వివరాలు
నౌకలో మొత్తం 29మంది సిబ్బంది
గ్రీస్‌కు చెందిన డైనకామ్ ట్యాంకర్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈ నౌక నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. నౌకలో మొత్తం 29మంది సిబ్బంది ఉన్నారు.వీరిలో భారతీయులతో పాటు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన నావికులు కూడా ఉన్నారు. ఈ నౌక కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సింధు భారతీయుడు. హర్మూజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా భారత్‌లో ఇంధన సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో షెన్‌లాంగ్ నౌక సురక్షితంగా భారత్‌కు చేరుకోవడం కొంత ఊరటనిస్తోంది. ఇదే సమయంలో భారత పతాక నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించనున్నట్లు ఇరాన్ నుంచి సంకేతాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంధన సరఫరాలపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.