Penguin: ఉరుగ్వే తీరంలో 2,000 పెంగ్విన్‌లు మృతి; అసలేమైంది?
తూర్పు ఉరుగ్వే తీరం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. దాదాపు వేలకొద్ది పెంగ్విన్‌ల మృతదేహాలు ఉరుగ్వేలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. గత 10 రోజుల్లో మొత్తం 2,000 పెంగ్విన్‌ల మృతేహాలను తాము గుర్తించినట్లు ఉరుగ్వే అధికారులు తెలిపారు. చనిపోయిన పెంగ్విన్‌లలో ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నాయని, అలల ప్రవాహాల ద్వారా ఉరుగ్వే తీరాలకు కొట్టుకొచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతుజాలం విభాగం అధిపతి కార్మెన్ లీజాగోయెన్ చెప్పారు. మృతి చెందిన పెంగ్విన్‌లను పరీక్షించగా వాటిలో ఎలాంటి ఇన్ఫ్లుఎంజాను గుర్తించలేదని లీజాగోయెన్ పేర్కొన్నారు. సాధారణంగా మెగెల్లానిక్ పెంగ్విన్‌లు దక్షిణ అర్జెంటీనాలో తీరంలో ఎక్కువగా ఉంటాయి. శీతాకాలం సమయంలో ఆహారంతో పాటు వెచ్చదనానికి బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటో తీరానికి వలస వెళ్తాయి.
ప్రతికూల వాతావరణం కారణంగానే చనిపోయాయా?
సాధారణంగా పెంగ్విన్‌లు ప్రతి ఏటా కొన్ని చనిపోతుంటాయని, అయితే ఈ స్థాయిలో వేల సంఖ్యలో ఎప్పుడూ చనిపోలేది లీజాగోయెన్ చెప్పారు. ఒక్కరోజులోనే అట్లాంటిక్ తీరానికి ఆరు మైళ్ల (10 కిలోమీటర్లు) పొడవునా 500 కంటే ఎక్కువ చనిపోయిన పెంగ్విన్‌లను లెక్కించినట్లు లగునా డి రోచా డైరెక్టర్ హెక్టర్ కేమారిస్ పేర్కొన్నారు. మితిమీరిన చేపలు పట్టడం, అక్రమంగా చేపలను వేటాటడం వల్లే ఈ స్థాయిలో మాగెల్లానిక్ పెంగ్విన్ మరణాలు సంభవించినట్లు పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. జులై మధ్యలో ఆగ్నేయ బ్రెజిల్‌ను తాకిన అట్లాంటిక్‌లోని ఉపఉష్ణమండల తుపాను కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా పెంగ్విన్‌లు చనిపోయి ఉండొచ్చని ఎన్‌జీఓ ఎస్ఓఎస్ మెరైన్ వైల్డ్‌లైఫ్ రెస్క్యూకి చెందిన రిచర్డ్ టెసోర్ అంచనా వేశారు.