South Africa: ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్‌ఐవీ.. ఎస్వతినిలో భయానక పరిస్థితి!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా ప్రాంతంలోని అతిచిన్న దేశమైన ఈశ్వతిని (పూర్వ నామం స్వాజిలాండ్)లో ఎయిడ్స్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. సుమారు 12 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో దాదాపు 3 లక్షల మంది—అంటే ప్రతి నలుగురిలో ఒకరు—హెచ్‌ఐవీ బారిన పడినవారే. ప్రతి సంవత్సరం సుమారు 7 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య యువతలో హెచ్‌ఐవీ ప్రబలంగా ఉండటంతో, ఈ వయస్సు గుంపులో అత్యధిక ప్రభావం ఉన్న దేశంగా ఎస్వతిని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తోంది.
వివరాలు
ఎందుకీ పరిస్థితి?
దేశ జనాభాలో సుమారు 60 శాతం మంది పేదరిక రేఖ కంటే దిగువన జీవిస్తున్నారు. ఉపాధి కోసం అనేక మంది పొరుగున ఉన్న సౌతాఫ్రికా గనుల్లో కూలీలుగా పనిచేయడానికి వెళ్తున్నారు. అక్కడ గనుల యజమానులు ఎస్వతిని మహిళలను లైంగికంగా దోపిడీ చేయడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే ఎస్వతినిలో ప్రసిద్ధ సంప్రదాయ నృత్యం 'రీడ్ డ్యాన్స్'కు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు డబ్బు కోసం వారిని ఆశ్రయించడం కూడా వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తోంది.
వివరాలు
స్కూల్ వయస్సులోనే లైంగిక సంబంధాలు
సురక్షిత లైంగిక చర్యలు పాటించకపోవడం, సంప్రదాయాల పేరిట అనియంత్రిత సంబంధాలను అనుమతించడం వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమం చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల్లోనే దాదాపు 18 శాతం మంది స్కూల్ వయస్సులోనే లైంగిక సంబంధాలు ప్రారంభించినట్లు వెల్లడవడం గమనార్హం. దేశంలో బహుభార్యత్వం కూడా సాధారణమే. అక్కడి రాజు ప్రతి సంవత్సరం 'రీడ్ డ్యాన్స్' సందర్భంగా ఒక యువతిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. దేశంలో తొలి హెచ్‌ఐవీ కేసు 1986లో నమోదు కాగా, ఆ తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది.
వివరాలు
మందుల కొరత
హెచ్‌ఐవీ నియంత్రణలో కీలకమైన లెనాకాపవిర్ మందుల కొరత దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. హెచ్‌ఐవీ నిర్మూలన కోసం పనిచేస్తున్న గ్లోబల్ ఫండ్ ద్వారా ప్రతి సంవత్సరం 6 వేల డోసులు రావాల్సి ఉండగా, అందులో సగం మాత్రమే అందుతున్నాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం చేపట్టిన ఎయిడ్స్ నివారణ చర్యల వల్ల హెచ్‌ఐవీ బాధితుల్లో చాలామందికి చికిత్స అందుతోంది. దీనివల్ల మరణాలను గణనీయంగా తగ్గించగలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.