
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో 'ఒకే పదవి' ఫార్ములా.. డీకేకు రాజీనామా ఒత్తిడి?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు తీవ్రరూపం దాల్చింది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలన్న ఆయన వర్గీయుల డిమాండ్‌తో సింహాసన పోరు ముదిరిపోతోంది. అయితే అలాంటి ప్రతిపాదన లేదంటూ సిద్ధంగా సీఎం సిద్ధరామయ్య తన వైఖరిని స్పష్టం చేశారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని విభేదాలు మరింత గాఢమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్ష పదవి నుంచి డీకే శివకుమార్‌ను తొలగించేందుకు సిద్ధరామయ్య వర్గం యత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Details
డీకే శివకుమార్ రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్లాన్
పీసీసీ చీఫ్ పదవికి పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్న సీనియర్ నేత సతీష్ జార్కిహోళిని సీఎం వర్గం ప్రతిపాదించింది. ఎస్టీ వర్గానికి చెందిన నాయకుడిగా జార్కిహోళిని ప్రాజెక్ట్ చేస్తూ,కులసమీకరణల ఆధారంగా హైకమాండ్‌ను ఒప్పించే యత్నం జరిగింది. కాంగ్రెస్‌లో పాటిస్తున్న ఒకరికి ఒకే పదవి విధానానికి అనుగుణంగా, పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జార్కిహోళి తన మంత్రిత్వ పదవికి రాజీనామా చేయాలని సిద్ధరామయ్య వర్గం అతడిని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ మార్పు ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి అమలవ్వాలని సీఎం వర్గం భావిస్తోంది. డీకే శివకుమార్ రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు సిద్ధరామయ్య వర్గం ఈ వ్యూహాన్ని రచించినట్లు అంటున్నారు. డీకే అధికారాలను కత్తిరించడానికీ ప్రణాళిక సిద్ధమవుతోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.