America: అమెరికాలో బ్యాంకింగ్ సేవల్లో భారీ అంతరాయం.. ఇబ్బందుల్లో కస్టమర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి సాంకేతిక సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటీవల విమాన సర్వీసులు, మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలోని పలు ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్ సేవలు కూడా నిలిచిపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీమోర్గాన్ చేజ్, క్యాపిటల్ వన్, యూఎస్ బ్యాంక్, వెల్స్ ఫార్గో వంటి ప్రముఖ బ్యాంకుల కస్టమర్లు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతాలను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం సాధ్యం కావడం లేదని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. పలు బ్యాంకుల సేవల్లో సమస్యలు తలెత్తినట్లు వినియోగదారులు నివేదించారు.
వివరాలు
సాంకేతిక లోపమే కారణం.. చేజ్ వివరణ
ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం, బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు.
జేపీమోర్గాన్ చేజ్‌కు సంబంధించి 3,300కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గోలకు కలిపి సుమారు 1,400 ఫిర్యాదులు అందాయి.
బ్యాంకింగ్ సేవల్లో ఏర్పడిన అంతరాయంపై జేపీమోర్గాన్ చేజ్ స్పందించింది. తమ అంతర్గత సిస్టమ్‌లలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా కొంతమంది కస్టమర్లకు సేవలు నెమ్మదించినట్లు వెల్లడించింది.
ఈ సాంకేతిక సమస్య ఇతర బ్యాంకుల సేవలపైనా ప్రభావం చూపి ఉండవచ్చని తెలిపింది.
అయితే ఈ అంతరాయానికి సైబర్ దాడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
వివరాలు
కస్టమర్లకు ఎర్రర్ మెసేజ్‌లు
ఈ సందర్భంగా చేజ్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సాంకేతిక సమస్య కారణంగా కొన్ని లావాదేవీలు పూర్తవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు.
అయితే వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలు, నిధులను యాక్సెస్ చేయగలుగుతున్నారని వివరించారు.
మరోవైపు, చేజ్ బ్యాంకు సేవలను వినియోగించుకునేందుకు ప్రయత్నించిన కొంతమంది కస్టమర్లకు ఎర్రర్ మెసేజ్‌లు కనిపించినట్లు తెలిపారు.
కొన్ని సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని, వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సందేశంలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించాలని సూచించినట్లు తెలిపారు.
వివరాలు
కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం
ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు కూడా చేజ్ స్పందించింది.
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందం పనిచేస్తోందని తెలిపింది.
వినియోగదారులు కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించాలని సూచించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
చేజ్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంకు.
దేశవ్యాప్తంగా 86.6 మిలియన్ల మంది వ్యక్తిగత వినియోగదారులకు, 7.4 మిలియన్ల చిన్న వ్యాపారాలకు సేవలు అందిస్తోంది.
ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కటి సుమారు 70 మిలియన్ల మంది కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.
వివరాలు
ఇటీవల విమాన, మైక్రోసాఫ్ట్ సేవల్లోనూ అంతరాయం
వీరిలో అత్యధిక మంది అమెరికాలోనే ఉన్నారు. ఇలాంటి ప్రముఖ బ్యాంకుల సేవల్లో అంతరాయం ఏర్పడటంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమెరికాలో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల కమ్యూనికేషన్ వ్యవస్థలో వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు కూడా నిలిచిపోయాయి.
ఈ సమస్య కారణంగా వినియోగదారులు ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ వంటి సేవలను ఉపయోగించుకోలేకపోయారు.
వివరాలు
ఇటీవల విమాన, మైక్రోసాఫ్ట్ సేవల్లోనూ అంతరాయం
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం వ్యాపార సంస్థలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, న్యాయస్థానాలు, ప్రభుత్వ విభాగాలపై కూడా ప్రభావం చూపింది.
నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌లో మార్పులు చేస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని అనుమానించారు.
దీంతో అనేక సర్వర్లు అందుబాటులో లేకుండా పోయి, మిగిలిన మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడినట్లు భావించారు.
అయితే మైక్రోసాఫ్ట్ సాంకేతిక నిపుణులు ఈ సమస్యను పరిష్కరించారు.