Loading...
Pakistan: పాక్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థులపై ఆర్మీ అధికారి తుపాకీతో కాల్పులు
పాక్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థులపై ఆర్మీ అధికారి తుపాకీతో కాల్పులు

Pakistan: పాక్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థులపై ఆర్మీ అధికారి తుపాకీతో కాల్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో విద్యార్థులపై ఓ ఆర్మీ అధికారి దాడికి దిగడంతోపాటు తుపాకీతో కాల్పులు జరపడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫీజులు, తరగతుల షెడ్యూల్‌కు సంబంధించి విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టగా.. వారిని అదుపు చేసే క్రమంలో ఆర్మీ అధికారి దౌర్జన్యంగా వ్యవహరించారు. తొలుత విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఆయన.. అనంతరం తన సర్వీస్‌ తుపాకీని బయటకు తీసి గాల్లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఇస్లామాబాద్‌లోని సర్హద్‌ యూనివర్సిటీ రవత్‌ క్యాంపస్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఫీజులు,తరగతుల షెడ్యూల్‌ విషయంలో తమ హెచ్‌ఓడీకి వ్యతిరేకంగా విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు యూనివర్సిటీ హెడ్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ ఐనా అక్కడికి చేరుకున్నారు.

వివరాలు 

విద్యార్థులపై కర్రతో దాడి

అయితే కొంతమంది విద్యార్థులు నిరసన విరమించేందుకు ససేమిరా అనడంతో.. ఆమె తన భర్త అయిన ఆర్మీ అధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం.

యూనిఫాంలో క్యాంపస్‌కు వచ్చిన ఆ అధికారి.. విద్యార్థులను శాంతింపజేసే బదులు వారిపై కర్రతో దాడి చేయడం ప్రారంభించారు.

దీంతో పలువురు విద్యార్థులు ఆయన తీరును తీవ్రంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రశ్నించిన విద్యార్థులపైనా అధికారి చేయి చేసుకున్నారు.

దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి.. కొంతమంది యువకులు ఆ అధికారిపైకి దూసుకెళ్లారు.

వివరాలు 

గాల్లోకి కాల్పులు 

విద్యార్థులు తనపైకి రావడంతో ఆర్మీ అధికారి తన సర్వీస్‌ తుపాకీని బయటకు తీశారు.

తొలుత విద్యార్థుల వైపు గన్‌ గురిపెట్టిన ఆయన.. అనంతరం పలు రౌండ్లను గాల్లోకి కాల్చారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

కాల్పులు జరిపిన అధికారి కల్నల్‌ లేదా బ్రిగేడియర్‌ స్థాయి వ్యక్తి అయి ఉండొచ్చని సంబంధిత వర్గాల సమాచారం.

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌ అవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన పాక్‌ ఆర్మీ

ఆర్మీ అధికారి క్యాంపస్‌లో గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పాకిస్థాన్‌ ఆర్మీ స్పందించింది.

సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఘటనపై అంతర్గత విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపాయి. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా, పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆయా ప్రాంతాల్లో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలకు పాక్‌ సైన్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.

తాజాగా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులపై ఆర్మీ అధికారి దాడి చేసి, తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విద్యార్థులపై ఆర్మీ అధికారి దాడి

ADVERTISEMENT