
Pak Army Chief: అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్‌కు తీవ్ర అవమానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్ తీవ్ర భంగపాటును ఎదుర్కొన్నారు. ఆయన్ను స్వదేశీయులే తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు వాషింగ్టన్‌లో ఆయన బస చేస్తున్న హోటల్ ఎదుటకు చేరుకున్న పాక్ పౌరులు, మునీర్ హోటల్ నుంచి బయటకు వస్తుండగానే, "మీరు హంతకులు, పిరికివారు, నియంతలు" అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మునీర్ ఉన్నంతవరకూ పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఉండదని,దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరుల మృతికి ఆయనే ప్రధానంగా బాధ్యుడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో తుపాకులే పాలన చేస్తే ప్రజాస్వామ్యం మృతిచెందుతుందంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Details
ఇతర దేశాల సైనికాధికారులకు ఎలాంటి ఆహ్వానం పంపలేదు
ఈ నిరసన కార్యక్రమం పాకిస్థాన్ ప్రతిపక్ష పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మద్దతుదారులు చేపట్టినట్టు సమాచారం. ఇక పాక్ తరఫున మునీర్ అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనాలని యూఎస్ మునీర్‌కు ఆహ్వానం పంపిందని ఇటీవల పలు అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఈ వార్తలపై అమెరికా అధికారులు ఘాటుగా స్పందించారు. ఇతర దేశాల సైనికాధికారులకు ఎలాంటి ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. మునీర్‌కు ఆహ్వానం పంపినట్లు వస్తున్న వార్తలను అమెరికా పూర్తిగా ఖండించింది.