Pakistan: పీఓకే వార్తలపై పాక్ ఆంక్షలు.. అల్ జజీరా వెబ్‌సైట్ బ్లాక్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న నిరసనలు, అక్కడి పరిస్థితులపై వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం పలు వార్తా వెబ్‌సైట్లపై ఆంక్షలు విధించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్ జజీరా ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో పాటు మరికొన్ని వార్తా వెబ్‌సైట్లు అందుబాటులో లేకుండా చేసినట్లు సమాచారం. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా బలగాల అణచివేత చర్యలపై వరుస కథనాలు వెలువడుతున్న సమయంలో ఈ డిజిటల్ సెన్సార్‌షిప్ అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పీఓకే ఎన్నికల ప్రక్రియ, అక్కడి నిరసనలకు సంబంధించి అల్ జజీరా ఎంపిక చేసిన వార్తలను మాత్రమే ప్రసారం చేస్తోందని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల నిజానిజాలను ఏబీపీ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదని పేర్కొంది.
వివరాలు
ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకే శాసనసభ ఎన్నికలు
ముజఫరాబాద్‌లో ఓటింగ్‌కు ప్రజలు ముందుకు రావడం లేదని, గత 50 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా అక్కడి పరిస్థితులను సమగ్రంగా నివేదించడం కష్టంగా మారిందని అల్ జజీరా వెల్లడించింది.
ముజఫరాబాద్‌లో మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడగా, ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయిందని తన కథనంలో తెలిపింది.
ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వివరాలు
హింసాత్మక ఘటనల్లో 40 మందికిపైగా మృతి
జూన్ నెల నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, జూన్ 2న పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమర్పించిన నివేదిక ఆధారంగా పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించేందుకు ఇస్లామాబాద్ కోర్టు గతంలో ప్రయత్నాలు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.