Pakistan Air Pollution: దీపావళి పొగ లాహోర్‌కు చేరింది.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేయడానికి భారత్‌లో దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా కూడా కారణమని పంజాబ్ రాష్ట్ర సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఆరోపించారు. భారత నగరాల నుంచి వచ్చిన పొగతో పాటు పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వెలువడిన కాలుష్య కారకాలు లాహోర్‌లోకి ప్రవేశించాయని పేర్కొన్నారు. నవంబర్ 8న దీపావళి వేడుకల సందర్భంగా భారత్‌లోని పలు నగరాల్లో బాణసంచా కాల్చడంతో వెలువడిన పొగ తూర్పు దిశ నుంచి లాహోర్ వైపు వచ్చినట్లు తెలిపారు.
వివరాలు
వాయు కాలుష్యం పెరగడానికి కారణం
అమృత్‌సర్, లూధియానా, జలంధర్, పాటియాలా, భటిండా, ఫిరోజ్‌పూర్ నగరాల నుంచి కాలుష్యంతో కూడిన గాలులు లాహోర్ వైపు వీచాయని మరియం ఔరంగజేబ్ వెల్లడించారు.
ఈ కారణంగా నవంబర్ 8న నగరంలో గాలి నాణ్యత మరింత దిగజారిందని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టులు పెట్టారు.
దీపావళి బాణసంచా పొగతో పాటు పంట కోతల అనంతరం వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం కూడా వాయు కాలుష్యం పెరగడానికి కారణమని ఆరోపించారు.
వివరాలు
ప్రమాదకర స్థాయికి లాహోర్‌లో వాయు కాలుష్యం
మరోవైపు దీపావళి సమయంలో లాహోర్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) 600 మార్కును దాటింది. నవంబర్ 9 ఉదయం పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
కొన్ని పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 1,000కు పైగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఆ తర్వాత నగరంలో కాలుష్య తీవ్రత కొంత తగ్గింది. గాలి వేగం పెరగడం,గాలి దిశ మారడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలు ఇందుకు దోహదపడ్డాయని మంత్రి మరియం ఔరంగజేబ్ తెలిపారు.