Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని కానున్నారు. అదే సమయంలో, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో-ఛైర్మన్ అసిఫ్ జర్దారీ పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలా రోజుల చర్చల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రెండు పార్టీల ఒప్పందం కుదిరినట్లు మంగళవారం అర్థరాత్రి సంయుక్త విలేకరుల సమావేశంలో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీపీపీ, పీఎంఎల్-ఎన్ ముందుకొచ్చాయి.
ఆయూబ్‌ఖాన్‌కు పీఎం అభ్యర్థిగా ప్రకటించిన పీటీఐ పార్టీ
ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ ఒమర్ అయూబ్ ఖాన్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఒమర్ అయూబ్ పీటీఐ ప్రధాన కార్యదర్శి, మాజీ సైనిక నియంత అయూబ్ ఖాన్ మనవడు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని హరిపూర్ నుంచీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎమ్‌ఎల్-ఎన్) అభ్యర్థిగా 2013 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అతను 2018 సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)లో చేరాడు. ఇటీవల జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటంతో పార్టీ ప్రధాని అభ్యర్థిగా అయూబ్ ఖాన్‌ను పార్టీ ప్రకటించింది.