LOADING...
Bangladesh: పాకిస్తాన్ జనరల్ తో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..
పాకిస్తాన్ జనరల్ తో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..

Bangladesh: పాకిస్తాన్ జనరల్ తో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాలు మారుతున్న తీరును చూస్తే రాజకీయ వాతావరణం వేగంగా మారుతోందని స్పష్టమవుతోంది. ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉన్న దేశాలు విరోధులుగా మారుతుండగా, శత్రువులుగా ఉన్న దేశాలు ఇప్పుడు సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్-బంగ్లాదేశ్ సంబంధాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా అక్టోబర్ 25న పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మిర్జా, బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌ను ఢాకాలోని రాష్ట్ర అతిథి గృహం జమునాలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

చర్చ

ద్వైపాక్షిక అంశాలపై చర్చ

ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడులు,రక్షణ రంగ సహకారం వంటి పలు అంశాలపై చర్చ జరిగిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న చారిత్రక,సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ జనరల్ మిర్జా పలు రంగాల్లో సహకారం బలోపేతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. "మారెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి," అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కరాచీ-చిట్టగాంగ్ మధ్య నౌకా రవాణా ప్రారంభమైందని, త్వరలో ఢాకా-కరాచీ మధ్య వైమానిక రవాణా కూడా ప్రారంభం కానుందని తెలిపారు. ఇక వెస్ట్ ఆసియా పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించారు. ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరముందని ఉభయ పక్షాలు అభిప్రాయపడ్డాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రాంతీయ అస్థిరత కలిగించే గెరిల్లా గుంపుల పాత్రపై కూడా చర్చ జరిగింది.

షేక్ హసీనా

హసీనా వెళ్లిన తరువాత దిశ మారిందా?

షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు అయిన నేపథ్యంలో యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢాకా భారత దేశానికి దూరమై పాకిస్థాన్ వైపు మొగ్గుచూపుతోందనే అభిప్రాయం బలపడుతోంది. రెండు దేశాల మధ్య వీసా రహిత ప్రయాణ ఒప్పందం,ప్రభుత్వ,రాయబారి పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రయోజనాలు, విద్యార్థులకు పాకిస్థాన్ ఇచ్చిన 500స్కాలర్‌షిప్‌లు ఈ కొత్త దిశకు నిదర్శనం. అదే కాకుండా, 2018 తర్వాత నిలిచిపోయిన ఢాకా-కరాచీ నేరుగా విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సముద్ర మార్గంలోనూ ఇరుదేశాలు 47 సంవత్సరాల తర్వాత నేరుగా వాణిజ్య రవాణా తిరిగి ప్రారంభించాయి. గత సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పాకిస్థాన్ ఉత్పత్తుల దిగుమతులపై ఉన్న పరిమితులు తొలగించింది. ఇంతకుముందు పాకిస్థాన్ నుండి వచ్చే సరుకులు మూడు దేశాల నౌకల ద్వారా మాత్రమే చేరేవి.

ఆందోళన

భారత్‌కు పెరుగుతున్న ఆందోళన

ఈ పరిణామాలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి.ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవల పేర్కొన్నట్లుగా, చైనా-పాకిస్థాన్-బంగ్లాదేశ్ అనుసంధానం భారత్ భద్రతకు కొత్త సవాళ్లు తెచ్చే అవకాశం ఉంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు విస్తారమైనది. స్మగ్లింగ్, మిలిటెన్సీ పెరిగే ప్రమాదం ఉందని భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2004లో అస్సాం వద్ద చైనా తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఘటనను కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆ కుట్ర వెనుక పాకిస్థాన్ ISI ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా యూనస్ పాకిస్థాన్ జనరల్‌కు అందించిన మ్యాప్‌లో అస్సాం,ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించడం భారత్‌లో ఆగ్రహం రేపింది.

ఆందోళన

భారత్‌కు పెరుగుతున్న ఆందోళన

ఇంతకు ముందు చైనాలో ఆయన చేసిన ప్రకటనలతో కూడా ఢిల్లీ అసహనం వ్యక్తం చేసింది. నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఢాకా-ఇస్లామాబాద్ రక్షణ సహకారం పెరిగితే భారత్‌కు పశ్చిమ, తూర్పు సరిహద్దుల వద్ద కూడా ప్రత్యర్థి శక్తులు బలపడే ప్రమాదం ఉంది. ఇది భారత్ ప్రభావాన్ని దక్షిణాసియాలో తగ్గించి, బే ఆఫ్ బెంగాల్, ఈశాన్య ప్రాంతంలో అస్థిరతకు దారితీయవచ్చు. ప్రస్తుతం యూనస్ విధానాలతో బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాలు ఏకీభవించడం లేదు. పాకిస్థాన్‌పై అనుమానం వ్యక్తం చేసే పెద్ద వర్గం దేశంలో ఉంది. అయినప్పటికీ, ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాల్సి ఉంది.