Loading...
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు కంచుకోటలో గవర్నర్ పాలన.. పీటీఐ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఇమ్రాన్ ఖాన్‌కు కంచుకోటలో గవర్నర్ పాలన.. పీటీఐ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు కంచుకోటలో గవర్నర్ పాలన.. పీటీఐ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్‌కు బలమైన పట్టున్న ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గవర్నర్ పాలన విధించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు నిలిచిపోయాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సైన్యం మద్దతున్న ప్రభుత్వానికి, పీటీఐకి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

వివరాలు 

రాజకీయ కక్షతోనే గవర్నర్ పాలన విధించారన్న పీటీఐ

ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పాలన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

అయితే, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్‌ఎస్‌ఎస్) నివేదిక ప్రకారం.. 2025తో పోలిస్తే 2026 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య ఈ ప్రావిన్స్‌లో పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 16 శాతం తగ్గాయి.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పీటీఐ అధికార ప్రతినిధి షేక్ వకాస్ అక్రమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయమని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడంతో పాటు ప్రజల చేత ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించారు.

వివరాలు 

రాష్ట్ర వ్యవహారాల నిర్వహణకు సైన్యం మోహరింపు

ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహా మేరకు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అత్యవసర పరిస్థితికి ఆమోదం తెలిపారు.

గవర్నర్ పాలన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ రాష్ట్ర పరిపాలన బాధ్యతలను చేపడతారు.

రాష్ట్ర వ్యవహారాల నిర్వహణతో పాటు ప్రజా ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సైనిక సిబ్బందిని మోహరించనున్నట్లు పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

నిరసనల మధ్య పీటీఐ నేతల అరెస్టులు

గవర్నర్ పాలన నిర్ణయంతో పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

పీటీఐకి చెందిన పలువురు సీనియర్ నేతలను అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

తాను, ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదిని అదుపులోకి తీసుకున్నట్లు జునైద్ అక్బర్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా, ఆయన విడుదలను డిమాండ్ చేస్తూ అఫ్రిది ఇటీవల లాంగ్ మార్చ్‌కు నాయకత్వం వహించారు.

పాకిస్థాన్ సైన్యం చేపడుతున్న చర్యల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

అక్టోబర్ ప్రారంభం నుంచి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వెంబడి సైనిక చర్యలను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

2013 నుంచి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో పీటీఐ ఆధిపత్యం

ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో 2013 నుంచి పీటీఐ పార్టీకి బలమైన రాజకీయ పట్టు ఉంది.

2024 ఎన్నికల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో 60శాతానికి పైగా సీట్లను ఈ పార్టీ గెలుచుకుంది.

అయితే, ఇమ్రాన్ ఖాన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌లో ఆధిపత్యం కలిగిన రెండు రాజకీయ కుటుంబాల పార్టీలు ఎన్నికల అనంతర అధికార ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.

ప్రస్తుతం పోటీతో కూడిన సాధారణ ఎన్నికలు జరిగితే పీటీఐ విజయం సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు ఆ కథనం తెలిపింది.

మరోవైపు, భద్రతా పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని తొలగించేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీటీఐ ఆరోపించింది.

ADVERTISEMENT