
Masood Azhar: ఉగ్రవాది మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల నష్టపరిహారం ఇచ్చే అవకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.
ఈ వైమానిక దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా ఈ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్, ప్రముఖ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్టు సమాచారం.
మసూద్ అజార్‌కు చెందిన 14 మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, భారత్ దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
దీనితో మసూద్ అజార్ కుటుంబానికి 14 కోట్లు పరిహారం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
వివరాలు
ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం
ఎందుకంటే, మృతి చెందిన వారు అందరూ అతనికి చెందినవారే కావడంతో ఆ మొత్తం అతనికే అందే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.
పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ రీలీజ్ ప్రకారం,ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదే సమయంలో,ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని బహావల్పూర్ నగరంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద క్యాంపులు లక్ష్యంగా తీసుకుని భారత వాయుసేన దాడులు జరిపిన విషయం తెలిసిందే.
బహావల్పూర్ పాకిస్తాన్‌లో 12వ అతిపెద్ద నగరం కాగా,లాహోర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వివరాలు
నష్టపోయిన కుటుంబాల కోసం ఇండ్లు
ఈ నగరంలోనే జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్) ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని 'జామియా మజ్జీద్ సుభాన్ అల్లా' లేదా 'ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్' అని కూడా పిలుస్తారు.
ఈ దాడుల్లో తన సోదరి,ఆమె భర్త, మేనల్లుడు,అతని భార్య, మరదలు, ఇంకా ఐదుగురు చిన్నపిల్లలు మరణించినట్లు మసూద్ అజార్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం అతని కుటుంబంలో మసూద్ అజార్ ఒక్కరే జీవించి ఉన్నట్లు సమాచారం.
దీంతో మృతులందరికీ వారసుడిగా అతడే మిగిలిపోవడంతో,పాక్ ప్రభుత్వం ఇచ్చే మొత్తం 14 కోట్ల రూపాయల పరిహారం అతనికే దక్కే అవకాశముందని భావిస్తున్నారు.
ఇక షరీఫ్ ప్రకటనలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నష్టపోయిన కుటుంబాల కోసం ఇండ్లు కూడా నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు.