LOADING...
Bangladesh: బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్‌ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు
బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్‌ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు

Bangladesh: బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్‌ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన, ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ దేశాన్ని కబ్జా చేసేందుకు రాడికల్ ఇస్లామిక్ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అంతేకాదు అంతర్గత వర్గ పోరును భారత్‌కు ముడిపెట్టి ఉద్రిక్తతలు సృష్టించాలనే కుట్ర సాగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్యను పేర్కొంటున్నారు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ప్రచారం చేస్తూ మతోన్మాద మూకలు రెచ్చిపోయాయి. ఈ క్రమంలోనే ఢాకాలోని భారత ఎంబసీపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. రాజకీయ, మత శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయని ఒక కీలక నిఘా నివేదిక స్పష్టంగా పేర్కొంది.

Details

బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే కుట్ర

ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆర్మీని అస్థిరపరిచే దిశగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నుతోందని ఆ నివేదిక హెచ్చరించింది. భారత్ వ్యతిరేక శక్తులు, రాడికల్ ఇస్లామిస్ట్ గుంపులు ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో ఘర్షణ వైపు బంగ్లాదేశ్‌ను నెట్టేందుకు మతోన్మాద గుంపులు, కొంతమంది మీడియా కథనాలు, సముద్ర సరిహద్దుల్లోని మత్స్యకారుల అంశాలను కూడా వాడుకుంటున్నట్లు సమాచారం. దీని వెనుక బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపరచాలనే లోతైన కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. .

Details

బంగ్లాదేశ్ సైన్యంతో సంప్రదింపులు

ప్రస్తుతం ఉన్న యూనస్ ప్రభుత్వం, అలాగే జమాతే ఇస్లామి వంటి మతన్మాద సంస్థలు యాంటీ-ఇండియా కథనాన్ని బలంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, భారత్ మాత్రం బంగ్లాదేశ్ సైన్యంతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా షేక్ హసీనా పదవీచ్యుతి సమయంలో బంగ్లా ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, భారత ఆర్మీ చీఫ్‌తో నేరుగా మాట్లాడిన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సైనిక స్థాయి సమన్వయం భారత వ్యతిరేక శక్తులకు అస్సలు నచ్చడం లేదని తెలుస్తోంది

Advertisement

Details

సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న శక్తులు

బంగ్లాదేశ్ సైన్యంలో మధ్యస్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పోలీస్ వ్యవస్థ దాదాపు నిష్క్రియంగా మారడంతో, సైన్యం అయిష్టంగానే 'ఫస్ట్ రెస్పాండర్' పాత్రను పోషించాల్సి వస్తోంది. అయితే మధ్యస్థాయి అధికారులు తమకు స్పష్టమైన రాజకీయ మద్దతు లేదని, చట్టపరమైన రక్షణ కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వీధుల్లో పరిస్థితిని నియంత్రిస్తున్నప్పటికీ, ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు భవిష్యత్తులో ప్రతీకారం ఎదురవుతుందన్న భయం సైన్యంలో నెలకొంది. ఇది బంగ్లా సైన్యంలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Details

ఐఎస్ఐ కుట్రపై హెచ్చరిక

పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), బంగ్లాదేశ్ సైనిక నిర్మాణాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ స్థాయిల్లో గందరగోళం సృష్టిస్తూ, సైన్యంలో ఐక్యత, పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని నివేదిక పేర్కొంది. అల్లర్లు, దుండగులపై చర్యల విషయంలో వివక్ష చూపుతున్నారన్న భావనను పెంచుతూ, సైన్యంలో అంతర్గత అస్థిరతను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది.

Details

భారత్‌కు ముప్పు ఏమిటి?

బంగ్లాదేశ్ భారత్‌ లాంటి పెద్ద దేశానికి ప్రత్యక్షంగా పెద్ద సవాల్‌గా మారకపోయినా, ఆ దేశంలో పరిస్థితులు మరింత అస్థిరంగా మారితే భారత్‌లోకి భారీగా అక్రమ వలసలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత అంతర్గత భద్రతకు, సరిహద్దు సమస్యలకు తీవ్ర సవాళ్లుగా మారే అవకాశం ఉంది. చొరబాట్లు, అక్రమ రవాణా, ఉగ్రవాద ముప్పు పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే, అది తూర్పు భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల భద్రతతో పాటు బంగాళాఖాతంలో భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద బంగ్లాదేశ్ పరిస్థితి ఉద్దేశపూర్వక కుట్రల ద్వారా దిగజారుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని నివేదిక తేల్చిచెప్పింది.

Advertisement