Loading...
Pakistan: భారత్‌పై పాక్ సైన్యం ప్రగల్భాలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్ రెహమాన్
భారత్‌పై పాక్ సైన్యం ప్రగల్భాలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్ రెహమాన్

Pakistan: భారత్‌పై పాక్ సైన్యం ప్రగల్భాలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్ రెహమాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్‌ను ఉద్దేశించి గతంలో పాక్‌ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఆసిమ్ మునీర్‌పై జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్‌) అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్‌ తీవ్రస్థాయిలో చురకలు వేశారు. పెషావర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కొనసాగుతున్న అణచివేత, రక్తపాతం చివరకు కొత్త భౌగోళిక సరిహద్దులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సైన్యం మాత్రం ఆర్భాటపు ప్రకటనలు చేయడాన్ని ప్రశ్నించారు.

వివరాలు 

పాక్ సైన్యం ఆయుధాలు విడిచిపెట్టాల్సి వచ్చింది 

1971లో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ ఫజ్లుర్ రెహమాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

''మనం ఈ దేశాన్ని రక్షించుకుంటాం. ఎవరూ మనకు హాని చేయలేరు. మీరు శక్తిమంతులే. కానీ 1971లో ఏం జరిగిందో అందరికీ తెలుసు'' అని అన్నారు.

నాటి యుద్ధానికి ముందు అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్‌ సైనికులను ఉద్దేశించి చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు.

''పర్వతాల్లో అయినా, ఎడారుల్లో అయినా, వీధుల్లో అయినా శత్రువులకు వ్యతిరేకంగా పోరాడతాం'' అంటూ యాహ్యా ఖాన్‌ అప్పట్లో ధీమా వ్యక్తం చేశారని ఫజ్లుర్ రెహమాన్‌ గుర్తుచేశారు.

అయితే ఆ స్థాయిలో ప్రగల్భాలు పలికినప్పటికీ.. మరుసటి రోజే పాక్ సైన్యం ఆయుధాలు విడిచిపెట్టాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

అణచివేత, రక్తపాతంపై హెచ్చరిక

1971లో జరిగిన ఓటమి నుంచి ఇప్పటికీ పాకిస్థాన్‌ పెద్దగా గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదని ఫజ్లుర్ రెహమాన్‌ విమర్శించారు.

దేశ ప్రజలు బాధలు, కష్టాలు ఎదుర్కొంటుంటే సైన్యం మాత్రం ఆనందంగా ఉండటం సరికాదని హితవు పలికారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం శక్తిమంతులమనే ప్రకటనలు చేయడం వల్ల పరిస్థితులు మారవని వ్యాఖ్యానించారు.

దేశంలో నిరంతర అణచివేత, రక్తపాతం కొనసాగితే దాని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ఫజ్లుర్ రెహమాన్‌ హెచ్చరించారు.

ఇటువంటి పరిస్థితులు చివరకు పాకిస్థాన్‌ భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, దేశంలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం

1971లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధం పాకిస్థాన్‌ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.

ఈ యుద్ధం చివరకు బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారితీసింది. 13 రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాక్‌కు చెందిన సుమారు 93 వేల మంది సైనికులు భారత్‌ ముందు లొంగిపోయారు.

దీంతో డిసెంబర్‌ 16న భారత్‌ అపూర్వ విజయాన్ని సాధించింది. ఆ యుద్ధంలో పాక్‌ సైన్యం ఎదుర్కొన్న పరాజయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌పై ఫజ్లుర్ రెహమాన్‌ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

1971లో ఓటమికి ముందు యాహ్యా ఖాన్‌ చేసిన ధీమా వ్యాఖ్యలను గుర్తుచేసి, ప్రస్తుతం కూడా సైన్యం అదే తరహాలో ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందన్న రీతిలో ఆయన విమర్శలు గుప్పించారు.

ADVERTISEMENT