LOADING...
Pakistan: ఆర్మీ చీఫ్'కు అపరిమిత అధికారాలు.. పాక్‌ పార్లమెంటు ఆమోదం..  
Pakistan: ఆర్మీ చీఫ్'కు అపరిమిత అధికారాలు.. పాక్‌ పార్లమెంటు ఆమోదం..

Pakistan: ఆర్మీ చీఫ్'కు అపరిమిత అధికారాలు.. పాక్‌ పార్లమెంటు ఆమోదం..  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌ (Asim Munir) అధికారాలను విస్తరించేందుకు అక్కడి ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంది. తాజాగా, ఆయన అధికార విస్తరణకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును పాకిస్థాన్‌ పార్లమెంటు ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీ లభించింది. కేవలం నలుగురు సభ్యులు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. అంతకుముందే, ఎగువ సభ రెండు రోజుల క్రితం ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టబద్ధంగా అమల్లోకి రానుంది.

వివరాలు 

ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ జీవితకాల భద్రత,ప్రత్యేక హోదా 

ఈ సవరణ ప్రకారం, ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ కొత్తగా ఏర్పడనున్న "చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌" పదవిని కూడా స్వీకరించనున్నారు. దీని ద్వారా ఆయనకు జీవితకాల భద్రత, ప్రత్యేక హోదా లభించనుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) మాట్లాడారు. ఈ సవరణను దేశంలో జాతీయ ఐక్యతకు కీలకమైన అడుగుగా పేర్కొన్నారు. వైమానిక, నావికాదళాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

వివరాలు 

కొంత మేర తగ్గనున్న పాక్‌ సుప్రీం కోర్టు అధికారాలు

ఇక కొత్త సవరణలో భాగంగా "ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు" (Federal Constitutional Court - FCC) అనే కొత్త న్యాయ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయించారు. ఈ కోర్టు రాజ్యాంగ సంబంధిత కేసులను పరిష్కరిస్తుంది. దీని వల్ల పాక్‌ సుప్రీం కోర్టు అధికారాలు కొంత మేర తగ్గనున్నాయి. ఈ ఎఫ్‌సీసీ న్యాయమూర్తులను నేరుగా ప్రభుత్వం నియమించనుంది. ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు ప్రభుత్వం తీసుకున్న పలు విధానాలను అడ్డుకోవడంతో పాటు, ప్రధాన మంత్రులను కూడా పదవి నుంచి తొలగించింది.

వివరాలు 

 పార్లమెంటు నుంచి వాకౌట్‌ చేసిన తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్

ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం కొత్త ఎఫ్‌సీసీ ఏర్పాటుకు ముందడుగు వేసినట్లు సమాచారం. అయితే, ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు వ్యతిరేకం తెలిపాయి. ఓటింగ్‌ సమయంలో వీరు పార్లమెంటు నుంచి వాకౌట్‌ చేశాయి.