Page Loader
పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన 
తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన

పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 09, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మరో కీలక నిర్ణయం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని తీర్మానించుకున్నారు. వచ్చిన నిధులను అనాథల సంరక్షణ కోసం ఖర్చుపెట్టాలని భావిస్తున్నారు. తోషాఖానాలోని బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు శిక్షకు గురయ్యారు. అయితే తాజాగా ఆయా పరిణామాల అనంతరం షెహబాజ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. మిలియన్ల విలువైన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించినట్లు షెహబాజ్ షరీఫ్ తెలిపారు. తద్వారా సమకూరిన నిధులను అనాథ పిల్లలను పోషించే సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు, విద్యాసంస్థలకు ఇవ్వదలిచినట్లు చెప్పారు.

DETAILS

అనాథల సంరక్షణ కోసమే ఈ నిధులు వెచ్చిస్తాం :  షెహబాజ్ షరీఫ్ 

పద్దతి ప్రకారమే అనాథలకు ఆయా నిధులను వెచ్చిస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రానున్న నూతన సర్కారు పెద్ద ఎత్తున ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. అయితే సంకీర్ణంలోని పలు రాజకీయ పార్టీలు ఈ ఆర్థిక క్షీణతను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయన్నారు. 1974లో క్యాబినెట్‌ డివిజన్‌ పరిధిలో పనిచేసేలా తోషాఖానా శాఖను ప్రారంభించారు. ఇందులోనే ప్రభుత్వాధినేత, ఎంపీలు, అధికారులకు విదేశీ అతిథులు ఇచ్చే బహుమతులను భద్రపరుస్తారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో ఆయనకు వచ్చిన బహుమతులను తక్కువ ధరకే సొంతం చేసుకుని విక్రయించిన ఆరోపణలపై కేసు రిజిస్టర్ అయ్యింది. ఆయన 58 ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు సమాచారం.