పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి
పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలోని ఒక మసీదు వద్ద మంగళవారం బాంబు పేలింది. ఈ ప్రమాదంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) మరణించారని స్థానిక వార్తా సంస్థ ARY న్యూస్ పేర్కొంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని నివేదించింది. ఈ ఘటన ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఎస్‌హెచ్‌ఓను అద్నాన్ అఫ్రిదీగా గుర్తించారు. గాయపడిన వారిని వైద్య సహాయం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరో ఉగ్రవాదిని అరెస్టు చేసిన భద్రతా దళాలు
జమ్రుద్‌లోని మసీదులో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఖైబర్ జిల్లా పోలీసులు నిఘా వర్గాల సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదుల్లో ఒకరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారిలో ఒకరు తనను తాను పేల్చుకోగా, మరో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోయిన ఉగ్రవాదిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో బాంబు పేలుళ్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రావిన్స్ నిరంతరం తీవ్రవాద దాడులను ఎదుర్కొంటోంది. ది డాన్ నివేదిక ప్రకారం, గత సంవత్సరం జూన్ 18, 2022 నుంచి జూన్ 18, 2023 వరకు, ప్రావిన్స్‌లో 15 ఆత్మాహుతి బాంబులతో సహా 665 తీవ్రవాద దాడులు జరిగాయి.