Pakistan: లేని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామన్న పాక్ అధికారి.. నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' పేరుతో చర్యలు చేపట్టామని పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లోని రాజౌరీ, మామూన్ వైమానిక స్థావరాలను తమ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఆయన చెప్పిన ప్రాంతాల్లో అసలు భారత వైమానిక దళానికి చెందిన స్థావరాలే లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజౌరీ జమ్మూకశ్మీర్‌లోని ఒక జిల్లా మాత్రమే. అక్కడ ఎలాంటి వైమానిక స్థావరం లేదు. అలాగే మామూన్ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సమీప ప్రాంతం. అది సైనిక కంటోన్మెంట్ ప్రాంతంగా మాత్రమే గుర్తింపు పొందింది.
వివరాలు
వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు సెటైర్లు
అక్కడ కూడా వైమానిక స్థావరం లేదు. ఈ విషయాలు తెలియకుండానే పాక్ అధికారి వ్యాఖ్యలు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఆయనపై వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అధికారి మాట్లాడుతూ.. రాజౌరీ, మామూన్ ప్రాంతాలపై దాడి చేయాలని తమ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఫతా-1 క్షిపణులను ప్రయోగించి ఆ రెండు ప్రాంతాలను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
వివరాలు
గతంలోనూ తప్పుడు ప్రచారాలు..
ఓ నెటిజన్ స్పందిస్తూ..'పాక్ నేతలు చెబుతున్న రాజౌరీ, మామూన్ ఎయిర్ బేస్‌ల ఆచూకీ కోసం పురావస్తు శాస్త్రవేత్తలు, గూగుల్ మ్యాప్స్ సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించాయి' అంటూ చమత్కరించారు. ఇదిలా ఉండగా, గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో కూడా పాకిస్థాన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలకే పాల్పడింది. భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులు చేశామని, రఫేల్ యుద్ధవిమానాన్ని కూల్చేశామని అప్పట్లో ప్రచారం చేసింది. అంతేకాదు, ధ్వంసమైన స్థావరాలు, కూల్చిన యుద్ధవిమానాల పేరుతో పలు చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే భారత్ వాటిపై వెంటనే నిజానిజాలు వెలుగులోకి తీసుకొచ్చింది. పాకిస్థాన్ ప్రచారం చేసిన చిత్రాలు గతంలో అక్కడే జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించినవని స్పష్టం చేస్తూ గట్టి సమాధానం ఇచ్చింది.