Palastine-Gaza-Combia University-Protests: కొలంబియా వర్సిటీ అకడమిక్ భవనాలు ఆక్రమించిన ఆందోళనకారులు...రంగంలోకి పోలీసులు
పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 12 గంటలుగా హామీల్టన్ హాల్లో బైఠాయించారు. నిరసనకారులకు కొలంబియా యూనివర్సిటీ యాజమాన్యం సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు పెడచెవిన పెట్టారు. మరో మార్గం ద్వారా తమ నిరసనలను వ్యక్తం చేసుకోవాలని యాజమాన్యం చెప్పినప్పటికీ ఆందోళనకారులు వినిపించుకోలేదు. నిరసనల్లో భాగంగా కొంతమంది ఆందోళనకారులు అకడమిక్ భవనాలను ఆక్రమించారు. చేసేదేమీలేకపోవడంతో యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటివరకు పోలీసుల అదుపులో వెయ్యిమంది ఆందోళనకారులు
ఇప్పటివరకు వెయ్యి మంది ఆందోళనకారులను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను అమెరికా శ్వేత సౌధం తప్పు పట్టింది. ఇది శాంతియుత ప్రదర్శన కాదని పేర్కొంది. ఆందోళన కారణంగా నార్తర్న్ కాలిఫోర్నియా క్యాంపస్ లో ఇప్పటివరకు ఒక మిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.