Ukrainian interceptor Drones: పేట్రియట్ క్షిపణులకంటే చవక.. ఉక్రెయిన్ యాంటీ డ్రోన్లపై అమెరికా ఆసక్తి
ఈ వార్తాకథనం ఏంటి
నాలుగేళ్ల క్రితం రష్యా భారీ దాడులతో ఉక్రెయిన్ దేశం అంతా భయాందోళనలకు గురైంది. వేల సంఖ్యలో రష్యా డ్రోన్లు వరుసగా దాడులు చేసినా, వాటిని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. పరిమితమైన వనరులే ఉన్నప్పటికీ శత్రు డ్రోన్లను అడ్డుకునే విధంగా క్వాడ్‌కాప్టర్ లేదా యాంటీ డ్రోన్లను స్వయంగా తయారు చేసుకుంది. ఈ డ్రోన్ల తయారీ ఖర్చు కూడా చాలా తక్కువ. ఒక్కోటి తయారు చేయడానికి సుమారు 1000 డాలర్లలోపే ఖర్చవుతుంది. కానీ రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్ల ధర అంతకంటే ఎక్కువగా ఉండడంతో ఆ దేశానికి ఆర్థికంగా నష్టం కలుగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఐడియా ఎలా పుట్టింది..?
డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలో పనిచేస్తున్న ఒక యువ ఇంజినీర్ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. మొదట్లో అతని ప్రయత్నాలను చాలామంది పెద్దగా పట్టించుకోకపోవడంతో పాటు నిరుత్సాహపరిచారు కూడా. అయినప్పటికీ అతను తన ప్రయోగాలను ఆపలేదు. వివాహాలు, ఇతర వేడుకల్లో వీడియో చిత్రీకరణ కోసం ఉపయోగించే సాధారణ క్వాడ్‌కాప్టర్లతోనే మొదట ప్రయోగాలు ప్రారంభించాడు. తరువాత అవే యుద్ధంలో ఉపయోగపడేలా మారాయి. ఈ డ్రోన్లను ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. వీటికి వార్ హెడ్ అమర్చుకొని ప్రయోగించవచ్చు. చిన్న బ్యాగులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లేలా వీటిని రూపొందించారు. అంతేకాదు, నైట్ విజన్ పరికరాలు అమర్చడంతో రాత్రి సమయంలో కూడా దూసుకొచ్చే శత్రు డ్రోన్లను అడ్డుకునే సామర్థ్యం వీటికి వచ్చింది.
వివరాలు
తక్కువ ఖర్చు.. శత్రువుకు పెద్ద నష్టం..!
శత్రువులు వినియోగించే డ్రోన్లతో పోలిస్తే ఈ డ్రోన్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఉక్రెయిన్‌కు కోట్లాది డాలర్ల వరకు ఖర్చు తగ్గుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక్కో పేట్రియాట్ క్షిపణి ధర దాదాపు 14 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇదే సమయంలో ఇరాన్ అందించిన డ్రోన్ల సహాయంతో రష్యా ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులు చేసింది. ఈ పరిస్థితులతో ఆందోళన చెందిన ఉక్రెయిన్ ఎన్నో సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి, శత్రు డ్రోన్లను అడ్డుకునే కొత్త మార్గాలను కనిపెట్టింది.
వివరాలు
గల్ఫ్ దేశాలకు కూడా ఉపయోగం..
ఇక గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్ల దాడులు పెరుగుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు అమెరికా భారీగా క్షిపణులను వినియోగిస్తోంది. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్షిపణుల కొరత ఏర్పడే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ తయారు చేసిన క్వాడ్‌కాప్టర్ డ్రోన్లు అమెరికాకు ఒక ఆశగా కనిపిస్తున్నాయి. వీటిని తమకు సరఫరా చేయాలని అమెరికా కోరగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.