LOADING...
US Army chief: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ చీఫ్‌కు షాక్.. పదవి నుంచి తప్పుకోమన్న హెగ్సెత్
పదవి నుంచి తప్పుకోమన్న హెగ్సెత్

US Army chief: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ చీఫ్‌కు షాక్.. పదవి నుంచి తప్పుకోమన్న హెగ్సెత్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆర్మీ చీఫ్‌గా ఉన్నర్యాండీ జార్జ్‌ పదవి నుంచి తప్పుకోవాలని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సూచించినట్లు సమాచారం. వెంటనే పదవీవిరమణ చేయాలని ఆయన స్పష్టంగా తెలిపినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఆర్మీలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారిని పదవి నుంచి తప్పించాలని హెగ్సెత్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించాయి. రక్షణ విభాగంలో మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో హెగ్సెత్ వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలువురు ఉన్నతస్థాయి జనరల్స్‌, అడ్మిరల్స్‌ను తొలగించి, వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించారు.

వివరాలు 

గల్ఫ్,ఇరాక్‌,అఫ్గానిస్తాన్‌ యుదాలలో సేవలు

ఈ నేపథ్యంలో 2023లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ర్యాండీ జార్జ్‌ను కూడా ఇప్పుడు పదవి నుంచి వైదొలగాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జరిగిన తొలగింపుల సమయంలో ఆయన కొనసాగినా, ప్రస్తుతం పరిస్థితులు మారడంతో ఆయనను తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పదాతిదళ అధికారి అయిన జార్జ్‌ వెస్ట్‌పాయింట్‌ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పొందారు. తన సైనిక జీవితంలో గల్ఫ్ యుద్ధం సహా ఇరాక్‌, అఫ్గానిస్తాన్‌లలో సేవలు అందించారు.

వివరాలు 

లాయిడ్ ఆస్టిన్ కు సహాయకుడిగా ర్యాండీ జార్జ్

జో బైడెన్ ప్రభుత్వ కాలంలో 2021-2022 మధ్య రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు సహాయకుడిగా పనిచేశారు. ఇక గతంలో కూడా ఉన్నతాధికారుల తొలగింపులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కాలంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్‌గా ఉన్న చార్లెస్ క్యూ. బ్రౌన్ జూనియర్ పై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి పలువురు ఉన్నత సైనికాధికారులు ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తప్పించడం కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

వ్యక్తిగత ఆయుధాలకు అనుమతి

ఇదిలా ఉండగా, అమెరికా సైనికుల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల్లో సైనికులు తమ వ్యక్తిగత ఆయుధాలను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హెగ్సెత్ నిర్ణయించారు. దళాల స్వీయ రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే విషయాన్ని వివరించారు.

Advertisement