Philippines: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టెకు పదవి గండం
ఈ వార్తాకథనం ఏంటి
ఫిలిప్పీన్స్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టెను పదవి నుంచి తొలగించే దిశగా ప్రతినిధుల సభ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఓటింగ్‌లో భారీ మెజారిటీతో ఆమెపై ఉద్వాసన తీర్మానాన్ని సభ ఆమోదించింది. మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె కుమార్తె అయిన సారాపై ప్రకటించని ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో పాటు అధ్యక్షుడిని హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌తో సారా డ్యుటెర్టెకు నెలకొన్న విభేదాలు ఇటీవలి కాలంలో మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో 255 మంది సభ్యులు ఆమెను పదవి నుంచి తొలగించాలంటూ మద్దతు ఇవ్వగా, కేవలం 26 మంది మాత్రమే వ్యతిరేకించారు.
వివరాలు
అవినీతి ఆరోపణల్లో అధ్యక్షుడు మార్కోస్ కుటుంబసభ్యలే చిక్కుకున్నారు: సారా
ఇప్పుడు ఈ అంశంపై ఫిలిప్పీన్స్ సెనేట్‌లో విచారణ జరగనుంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న సారాకు ఈ పరిణామం గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకూ కూడా సారా డ్యుటెర్టెపై ప్రతినిధుల సభ ఉద్వాసన తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానాన్ని ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడంతో ఆమె అప్పట్లో ఉపశమనం పొందారు. ప్రస్తుతం తనపై వస్తున్న ఆరోపణలను సారా తీవ్రంగా ఖండిస్తున్నారు. అధ్యక్షుడు మార్కోస్ కుటుంబ సభ్యులే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని ఆమె విమర్శిస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను ప్రధాన ప్రత్యర్థిగా మారకుండా అడ్డుకునేందుకే తనపై రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.